అమెరికా వస్తువులపై భారత్‌ ప్రతీకార సుంకాలు

అమెరికా వస్తువులపై భారత్‌ ప్రతీకార సుంకాలు

భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.  కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. 

మే 9న భారత్ పంపిన ప్రతిపాదన  ప్రకారం, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే దాదాపు 7.6 బిలియన్ డాలర్స్ విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది.  అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్‌ తప్పుపట్టింది.   ఈ నిర్ణయం ద్వారా భారత్ దాదాపు 1.91 బిలియన్ డాలర్ల మేర ఆదాయం పొందగలదని అంచనా.

అయితే, ఈ చర్య అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఇతర ఉత్పత్తుల ధరలను కూడా పెంచే అవకాశం ఉంది.  అంతేకాకుండా, ఈ చర్యల వల్ల భారత వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అందుకే దీనికి సమాన స్థాయిలో అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే హక్కు భారత్‌కు ఉందని పేర్కొంది.  భారత్ త్వరలో ట్రేడ్ ఇన్ గూడ్స్ కౌన్సిల్ (జిఎటిటి), సేఫ్‌గార్డ్స్ కమిటీలకు తన తదుపరి చర్యల గురించి తెలియజేయనుంది.

ఈ సమస్యను ద్వైపాక్షికంగా కూడా పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డోనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. క్రూడ్‌ స్టీల్‌ తయారీలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు దీనిపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం పడనుంది. ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్‌ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు.  ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంకోసం చర్చలు జరుపుతున్నాయి. భారత బృందం ఈ వారం వాణిజ్య చర్చల కోసం అమెరికా కూడా వెళ్లనుంది. 

సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ- వాషింగ్టన్‌ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.  ఇలాంటి సమయంలో భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధం కావడం చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు సుంకాలను పెంచే ప్రతిపాదనలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.