కాల్పుల విరమణ నిర్ణయంతో సరిహద్దు రాష్ట్రాల్లోని పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే, ఉగ్రదాడి అనంతరం పాక్‌పై విధించిన ఆంక్షల విషయంలో మాత్రం భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని సంబంధిత వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాక్‌తో దౌత్యపరమైన చర్యల విషయంలో ఎలాంటి మార్పూ లేదని భారత్ తాజాగా స్పష్టం చేసింది.
సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీసాల రద్దు నిర్ణయంలోనూ భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశాయి. సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది.
ఈ ఒప్పందంపై అప్పటి రెండు దేశాల ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య 6 నదులకు సంబంధించిన నీటి పంపకాల వివాదాలకు పరిష్కారంగా ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విశేషం. ఈ ఒప్పందం ప్రకారం, సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని రవి, బియాస్, సట్లెజ్ నదులు భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్థాన్‌కు ఇచ్చారు. పాకిస్థాన్‌లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది.
రెండు దేశాల మధ్య సహకారం కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఇరు దేశాల కమిషనర్లు ఏటా రెండుసార్లు సమావేశమవుతారు. ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు విధాన బాధ్యతలు నిర్వహిస్తుంది. వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాలూ కోరితేనే జోక్యం చేసుకుంటుంది.
సింధూ నదీ వ్యవస్థ నుంచి భారత్ 20 శాతం నీటిని, మిగిలిన 80 శాతాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దేశం పాక్ను దెబ్బకొట్టేందుకు భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాస్తవానికి ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందని, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చాలాకాలంగా భారత్ భావిస్తున్నది. ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతున్నది. అయితే అందుకు పాకిస్తాన్ విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నది. పైగా, భారత్ తనకు కేటాయించిన నీటిపై ప్రోజెక్టుల నిర్మాణంకు సహితం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందంన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించిన భారత్ దాని పునరుద్దరణకు ఒప్పుకొనే అవకాశాలు కనిపించడం లేదు. భారత్ తో పాకిస్థాన్ సఖ్యతతో వ్యవహరిస్తే ఈ ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపి, కొత్త ఒప్పందం ఏర్పాటుకు మాత్రమే అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఇప్పట్లో అటువంటి అవకాశాలు కనిపించడం లేదు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు