పీవోకే లో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతం

పీవోకే లో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌  విజయవంతం

పీవోకే లో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమయ్యిందని భారత సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ  త్రివిధ దళాల డీజీఎంవోలు ఆపరేషన్‌ సిందూర్‌ పై సోమవారం మీడియా సమావేశంలో పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను రక్షణశాఖ అధికారులు ప్రదర్శించారు.  పాకిస్థాన్‌ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదని తెలిపారు. తరువాత పాక్‌లోని నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. 

”పాకిస్థాన్‌, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశాం. పీవోకే భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్‌ క్షిపణులు, డ్రోన్‌లను తిప్పికొట్టాం. మన సైన్యానికి ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం” అని తెలిపారు. 

“సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. అదే సమయంలో పాకిస్థాన్‌ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. చైనా తయారు చేసిన పీఎల్‌-15 క్షిపణిని నేలకూల్చాం. పాకిస్థాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేశాం. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం” అని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.
 
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర‌వాద మౌళిక స‌దుపాయాలు, ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేశామ‌ని, కానీ పాకిస్థాన్ మిలిట‌రీ ఆ ఉగ్ర‌వాదుల‌కు మద్దతు ఇచ్చింద‌ని, దీంతో ఉద్రిక్త‌త‌లు ఉదృత‌మైన‌ట్లు ఎయిర్ మార్ష‌ల్ ఏకే భార్తి తెలిపారు. తాము కేవ‌లం ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా మాత్ర‌మే పోరాడిన‌ట్లు చెప్పారు. అయితే ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్‌ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు. 
గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల తీరు మారినట్లు డిజిఎంఒ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ తెలిపారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. భారత్‌ ఎయిర్‌ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. గ్రిడ్‌ సిస్టమ్‌లో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్‌ వాటిని అడ్డుకుంటుందని వెల్లడించారు.

మ‌న మిలిట‌రీ బేస్‌లు, మ‌న వ్య‌వ‌స్థ‌ల‌న్నీ పూర్తిగా ఆప‌రేష‌న్‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో ఎటువంటి మిష‌న్ అయినా చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని భార్తి తెలిపారు. మీడియా స‌మావేశంలో చైనాకు చెందిన పీఎల్‌-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ శ‌క‌లాల‌ను చూపించారు. ఇండియాపై దాడి చేసిన స‌మ‌యంలో పాకిస్థాన్ ఆ మిస్సైల్‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. ట‌ర్కీకి చెందిన వైఐహెచ్, సోన్‌గార్ డ్రోన్ల శ‌క‌లాల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు.