కాల్పుల విరమణను కొనియాడిన థరూర్, చిదంబరం

కాల్పుల విరమణను కొనియాడిన థరూర్, చిదంబరం
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, కాల్పుల విరమణ ఒప్పందం, ట్రంప్‌ ప్రకటన తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేఖలు రాశారు.
 
అయితే, పాకిస్థాన్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఊహించని విధంగా కీలకమైన కాంగ్రెస్ నేతలు చిదంబరం, శశిథరూర్ మద్దతు పలికారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత సైన్యం ప్రతిస్పందనను ఎంచుకున్న లక్ష్యాల వరకే పరిమితం చేయడం చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. 
 
విస్తృత యుద్ధం వల్ల కలిగే ముప్పును మోదీ గుర్తించారని, మరిన్ని ప్రాణాలు పోకుండా నివారించేందుకు ఇది అవసరమైన నిర్ణయమని పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా మోదీ తెలివిగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ‘ఇది బాధిత దేశం చట్టబద్ధమైన ప్రతిస్పందన’ అని చిదంబరం అభివర్ణించారు.  సరిహద్దు అవతలి నుంచి కాల్పుల వల్ల కొందరు భారతీయుల ప్రాణాలు పోవడం బాధాకరమంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాకిస్థాన్‌ చెప్పడాన్ని వృథా ప్రేలాపనగా కొట్టిపారేశారు. 
 
పారదర్శకత కోసం ఆపరేషనల్‌ విజువల్స్‌ను భారత్‌ విడుదల చేయడం, ఆపరేషన్‌ వివరాలను మీడియాకు వెల్లడించే కార్యక్రమంలో ఇద్దరు యువ మహిళా అధికారులను భాగస్వాములను చేయడాన్నీ చిదంబరం ప్రశంసించారు. అయితే, పహల్గాం ఘటన అనంతరం అఖిలపక్షానికి మోదీ హాజరుకాకపోవడాన్ని చిదంబరం విమర్శించారు.
 
కాగా, పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వ ప్రతిస్పందన లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ తెలిపారు. తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 1971లో ఇందిరాగాంధీ హయాంలో సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుండటంపై ఒక ఆంగ్ల వార్తా సంస్థ ప్రశ్నించగా శశిథరూర్‌ ఈ విధంగా స్పందించారు. 
 
బంగ్లాదేశ్‌ ప్రజలకు విమోచనం కలిగించడం నాటి లక్ష్యమని, అయితే ఇప్పటి పరిస్థితులు వేరని స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధంతో దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొన్నారు. ‘చెప్పాలనుకున్న గుణపాఠం పూర్తయింది. దీర్ఘకాల ఘర్షణ ఉద్దేశం భారత్‌కు లేదు. భారత్‌ ఎప్పుడూ దీర్ఘకాల యుద్ధాన్ని కోరుకోలేదు’ అని తెలిపారు.  `వాస్తవం ఏమిటంటే 1971 నాటి పరిస్థితులు, 2025 నాటి పరిస్థితులు ఒకటి కాదు. వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం కొనసాగించాలనుకున్నది యుద్ధం కాదు. కేవలం ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకున్నాం. చెప్పేశాం’’ అని పేర్కొన్నారు.