తొందరపడి ఇళ్లకు, స్వస్థలాలకు వెళ్ళకండి

తొందరపడి ఇళ్లకు, స్వస్థలాలకు వెళ్ళకండి
* ఏళ్ల తరబడి చేసిన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు చేసింది

ఇప్పటికిప్పుడు తొందరపడి ఇళ్లకు, స్వస్థలాలకు వెళ్లవద్దని, తదుపరి ప్రకటన వెలువడే వరకూ సురక్షిత ప్రాంతాల్లోనే పౌరులు ఉండాలని జమ్మూ కశ్మీర్ ప్రాంత ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ పాకిస్థాన్ మధ్య సైనిక చర్యల నిలిపివేత తరువాతి పరిణామాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు పలు సూచనలతో ఆదివారం మార్గదర్శకాలను వెలువరించింది.

కాల్పుల విరమణ జరిగిందనేది నిజమే అయితే ఇప్పటికీ పలు ప్రాంతాలో శిథిలాలు ఉన్నాయ. ఎక్కడైనా, ఎప్పుడైనా మందుపాతరలు పేలవచ్చు. లేదా ఏదైనా జరగవచ్చు, ఈ దశలో ప్రజలు తొందరపడి స్వస్థలాలకు తరలివెళ్లరాదని హెచ్చరించారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాలకు చెందిన రెండు లక్షల మందిని భారత్ పాక్ ఘర్షణల దశలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కాల్పుల విరమణ ప్రకటన జరిగినా సరిహద్దులకు ఆవల నుంచి ఇప్పటికీ అప్పుడప్పుడు కాల్పులు, క్షిపణి దాడులు, డ్రోన్ల దూకుడు జరుగుతోంది. ఈ దశలో ఇప్పటికీ ఎటువంటి ముప్పు అయినా తలెత్తవచ్చు. పైగా పేలని మందుపాతరలు ఉంటాయి. పూర్తిగా తనిఖీలు జరగాల్సి ఉందని తెలిపారు.

అన్ని చర్యల తర్వాత ప్రజలకు తెలిసేలా స్థానికంగా అందరికి తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అప్పటివరకూ తొందరపడి ఇళ్లకు స్వస్థలాలకు చేరుకోరాదని అధికారులు హెచ్చరించారు. అయితే జనం కాసింత ప్రశాంతత ఏర్పడటంతో ఉరుకులు పరుగులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. బాంబులు, మందుపాతరల గాలింపు వెలికితీతల ఆపత్కాల నివారణ చర్యల బృందాలు రంగంలోకి దిగుతాయి. తర్వాతనే జనం ఇళ్లకు చేరడం మంచిదని సూచనలు వెలువరించారు.

ఇలా ఉండగా, ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. అంతేకాకుండా కశ్మీర్‌ను అంతర్జాతీయ సమాజంలో ఎత్తి చూపేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడేదని, ఆర్థిక రంగం అభివృద్ధి చెందిందని, పిల్లలు పాఠశాలలకు వెళ్లేవారని, విమానాశ్రయాలలో రోజుకు 50-60 విమానాలు రాకపోకలు సాగించేవని ఆయన చెప్పారు. ఇప్పుడు కశ్మీర్‌ లోయ అంతా బోసిపోయి ఖాళీగా కన్పిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ వాటి మధ్య పలు అంశాలకు సంబంధించిన స్పర్థలు అలాగే కొనసాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్‌ 22న జరిగిన ఊచకోత లోయలోని పరిస్థితులనే పూర్తిగా మార్చివేసిందని ఆయన తెలిపారు.