ముక్కోణ‌పు సిరీస్ టీమిండియా కైవసం

ముక్కోణ‌పు సిరీస్ టీమిండియా కైవసం
భార‌త్ – శ్రీలంక – ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన‌ ముక్కోణపు సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడిన భారత మహిళా జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ పోరులో శ్రీలంకను 97 పరుగుల తేడాతో ఓడించి ట్రై-నేష‌న్ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.  స్మృతి మంధాన (116) సూపర్ సెంచ‌రీతో భారీ స్కోర్ చేసిన టీమిండియా అనంత‌రం ప్ర‌త్య‌ర్థిని 245 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దాంతో, 97 ప‌రుగుల‌తో హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ సేన జ‌య‌భేరి మోగించింది. 
తద్వారా నిరుడు ఆసియా క‌ప్ ఫైన‌ల్లో ఎదురైన ఓట‌మికి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది.  ముక్కోణ‌పు సిరీస్‌లో లీగ్ ద‌శ నుంచి అద‌ర‌గొట్టిన టీమిండియా ఫైన‌ల్లో పంజా విసిరింది. బ‌ల‌మైన శ్రీ‌లంక‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఆసియా క‌ప్ ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది. ప్రేమ‌దాస స్టేడియంలో ఓపెన‌ర్ స్మృతి మంధాన‌(116) రికార్డు సెంచ‌రీతో విరుచుకు ప‌డ‌గా, బౌల‌ర్లు లంక బ్యాట‌ర్ల‌కు ద‌డ పుట్టించారు. 

అమ‌న్‌జీత్ కౌర్ (3-54) నిప్పులు చెర‌గ‌గా, మిడిల్ ఓవ‌ర్లలో స్నేహ్ రానా(4-38) వికెట్ల వేట కొన‌సాగించింది. దాంతో, ఆతిథ్య లం 245 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. విధ్వంస‌క సెంచ‌రీతో జ‌ట్టు విజ‌యంలో భాగ‌మైన మంధాన ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికైంది. ఈ సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన స్నేహ్ రానా ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును స్వీక‌రించింది.

లీగ్ దశ‌లో శ్రీ‌లంక‌ను ఓడించి, ఆ త‌ర్వాతి పోరులో ఓడిన భార‌త్ ఫైన‌ల్లో ఛాంపియ‌న్ ఆట‌తో రెచ్చిపోయింది. మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెన‌ర్లు ప్ర‌తీకా రావ‌ల్(30), స్మృతి మంధాన‌(116 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శుభారంభం ఇచ్చారు. ఆ త‌ర్వాత‌ హ‌ర్లీన్ డ‌యోల్(47), జెమీమా రోడ్రిగ్స్(44) కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్(41)లు లంక బౌల‌ర్ల‌ను ఉతికేశారు. 

మిడిలార్డ‌ర్ మెరుపుల‌తో ప్ర‌త్య‌ర్థికి 343 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది భార‌త్. ఛేద‌న‌లో అమ‌న్‌జోత్ కౌర్ చెల‌రేగ‌డంతో శ్రీ‌లంక టాపార్డ‌ర్ విఫ‌ల‌మైంది. లంక ఓపెన‌ర్ హాసినీ పెరీరా(0)ను డకౌట్ చేసిన అమ‌న్‌జోత్, ఆ త‌ర్వాత డేంజ‌రస్ విష్మీ గుణ‌ర‌త్నేను బౌల్డ్ చేసింది. ఓపెన‌ర్ల వైఫ‌ల్యంతో క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును కెప్టెన్ చ‌మ‌రి ఆట‌పట్టు(51), నీలాక్షి డిసిల్వా(48) ఆదుకున్నారు. 

వీళ్లిద‌రూ 50 ప్ల‌స్ భాగ‌స్వామ్యంతో భార‌త బౌల‌ర్ల‌ను విసిగించారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని స్నేహ్ రానా విడ‌దీసింది. ఆట‌ప‌ట్టును బౌల్డ్ చేసిన త‌ను మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. ఆ త‌ర్వాత స‌మ‌ర‌విక్ర‌మ‌(26), అనుష్కా సంజీవ‌ని(28)లు పోరాడినా రానా తిప్పేయ‌డంతో లంక ఆలౌట్ అంచున నిలిచింది. ఈ ఆల్‌రౌండ‌ర్ అనుష్క వికెట్ తీయ‌డంతో లంక‌ 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దాంతో, భార‌త జ‌ట్టుకు 97 ప‌రుగుల భారీ విజ‌యం సొంత‌మైంది.

కాగా, ఈ మ్యాచ్లో స్మృతి మంధన్నా అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్లో మంధన్నా 2 సిక్స్లు బాదింది. ఈ క్రమంలోనే హర్మన్ప్రీత్ (53 సిక్స్లు)ను అధిగమించింది. ప్రస్తుతం స్మృతి 54 సిక్స్లతో టాప్లో ఉంది. ఓవరాల్గా వెస్టిండీస్ ప్లేయర్ డాటిన్ (91 సిక్స్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.