
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్దిరోజులుగా కాల్పులు, మిస్సైల్ దాడులతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అమెరికా జోక్యంతో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఒప్పందం జరిగిన కొద్ది గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. పాక్ వైఖరి గురించి స్పష్టమైన అవగాహన ఉన్న భారత సైన్యం అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసింది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి జమ్మూ కశ్మీర్, శ్రీనగర్ అఖ్నూర్, రాజౌరి, పూంచ్‌లో పరిస్థితులు సాధారణంగా మారాయి. వేకువ జాము నుంచి డ్రోన్లు, మిస్సైల్స్ కనిపించలేదు.
రాత్రి డ్రోన్ల దాడులు, పాక్ ఆర్మీ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. పూంచ్ సెక్టార్, రాజౌరి సెక్టార్లలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నది. మరో వైపు పంజాబ్‌లోని అమృత్ సర్‌లోనూ రెడ్ అలెర్ట్‌ని అధికారులు ఎత్తివేశారు. ఇక్కడ పరిస్థితులు సామాన్య స్థితికి చేరాయి. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరో వైపు అమృత్ డీసీ 5.24 గంటల ప్రాంతంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఏవైనా ఇబ్బందులుంటే సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పరిస్థితి సాధారణంగా కనిపించింది. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్‌లో కాల్పులు జరిపినట్లుగా, డ్రోన్లు, షెల్లింగ్ జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్ పరిపాలన అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించింది.
ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న పౌరులను ప్రభుత్వం అభినందించింది. ఏ పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉన్నామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రక్షణ సంబంధిత విషయాలపై సమాచారం కోసం అధికారిక వాట్సాప్ చానెల్‌లో సంప్రదించాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది.
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో సాధారణ ప్రజలు ‘జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన అన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని కోరింది. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం అనవసరమైన భయాందోళనలకు కారణమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఏవైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులతోపాటు సీడీఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లతో మోదీ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. కాల్పుల విరమణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు. అంతేకాదు సోమవారం పాక్‌తో జరగనున్న చర్చల అంశంపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు