
ప్రస్తుతం నకిలీ వార్తల విపరీతంగా వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని అరికట్టడాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర రావు సూచించారు. సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన దేవర్షి నారద జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ దేశహితం కాని వార్తలు కూడా వస్తున్నాయని, వాటికి కౌంటర్లు ఎలా ఇయ్యాలో కూడా ఆలోచించాలని చెప్పారు.
లేదంటే తప్పుడు కథనాలు సమాజంలో వ్యాప్తి చెందుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై విద్యా భారతి తన వంతు కృషి చేస్తున్నదని, కౌంటర్ నెరేటివ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. సమాజం ఎదగాలంటే భాగస్వాములందర్నీ కలుపుకుంటూ వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పిల్లల్లో వివిధ మాధ్యమాల ద్వారా విష బీజాలను నాటుతున్నారని, ఆ విష బీజాలను ఎదుర్కోవాలని తెలిపారు. దీని కోసం పుస్తకాలు, భారతీయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలని హితవు చెప్పారు.
మరో ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వం ఆడిట్ విభాగం రిటైర్డ్ డైరెక్టర్ సి.హెచ్.వి. సాయి ప్రసాద్ పాల్గొంటూ నారదుడు త్రిలోక సంచారిగా వుంటూ, విషయాలన్నింటినీ సత్య నిష్ఠతో హితంగా చెబుతూ, అన్ని వర్గాల వారికీ సమాచారాన్ని చేరవేశారని తెలిపారు. సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలతోనే కథన నిర్మాణాన్ని చేశారని పేర్కొన్నారు. ఈ ఆదర్శాలను ఆధారంగా చేసుకుంటూ పాత్రికేయులు కూడా ఆదర్శ స్థితికి చేరాలని ఆయన అభిలాష వ్యక్తం చేశారు. మరోవైపు సమాజంలో ఎప్పుడూ నెగెటివ్ ఆలోచన అనేది వుండనే వుంటుందని, కానీ మనం మాత్రం మంచినే గ్రహించాలని ఆయన సూచించారు. ఏఐ ద్వారా ప్రపంచనికి ముప్పు వుందని, కానీ దానిని వ్యతిరేకించలేమని, దానిలోని మంచినే స్వీకరించాలని చెప్పారు.
నారద జయంతి సందర్భంగా మీడియా రంగంలో విశేష సేవలందించిన పలువురు పాత్రికేయులు, సీనియర్ కాలమిస్టులు, మీడియా నిపుణులకు సన్మానాలు చేశారు. సీనియర్ పాత్రికేయులైన కొరిడే మహేష్, గాండ్ల సంపత్, సీనియర్ కాలమిస్ట్ డాక్టర్ భాస్కరయోగి, ఓయు జర్నలిజం విభాగం అధ్యాపకురాలు డాక్టర్ కలువాయి అనిత, సీనియర్ వీడియోగ్రాఫర్ కర్ణటపు రాఘవేంద్రలను సమాచార భారతి తరఫున విశిష్ట సేవా పురస్కారాలతో సత్కరించారు.
సమాచారభారతి అధ్యక్షులు ఆచార్య గోపాల్ రెడ్డి అధ్యక్షత వహిస్తూ సమాచార భారతి మూడు దశాబ్దాలుగా పత్రికా రంగంపైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని, వీటితో పాటు సామాజిక సమరసత, జాతి ఔన్నత్యం, సమగ్రతను పెంచడానికి మీడియా రంగాన్ని సాధనంగా చేసుకుంటోందని తెలిపారు. నారద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో ఉత్తమ విలువలతో వున్న జాతీయ భావాలు గల పాత్రికేయులను సమాచార భారతి పక్షాన సన్మానిస్తున్నామని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్, సమాచార భారతి ఉపాధ్యక్షులు వల్లీశ్వర్, సీనియర్ పాత్రికేయులు వేదుల నరసింహం కూడా పాల్గొన్నారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు