ఎల్వోసీ వెంబడి ఇద్దరు జవాన్లు సహా ఏడుగురి మృతి

ఎల్వోసీ వెంబడి ఇద్దరు జవాన్లు సహా ఏడుగురి మృతి
సరిహద్దు జిల్లాల్లో పాక్‌ సైన్యం శనివారం జరిపిన మోర్టార్‌ షెల్లింగ్‌, డ్రోన్‌ దాడుల్లో ఇద్దరు జవాన్లతో సహా ఏడుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో ఏడుగురు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. పాక్‌ దాడులతో భయం నీడలో గడుపుతున్న కశ్మీర్‌లోని మూడు జిల్లాల ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. పాక్‌ షెల్స్‌ ఇండ్లు, ప్రభుత్వ భవనాలపై పడుతుండటంతో బారాముల్లా, బండిపొరా, కుప్వారాకు చెందిన దాదాపు 1.10 లక్షల మంది తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు.

* పూంఛ్‌ సెక్టార్‌లోని కృష్ణ ఘాటి సమీపంలోని తన పోస్టు సమీపంలో శనివారం ఉదయం జరిగి ఫిరంగి దాడిలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ అమరులయ్యారు.
* ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
* రాజౌరీలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థాపా అధికారిక నివాసంపై జరిగిన ఫిరంగి దాడిలో ఆయన మృతి చెందారు.
* రాజౌరీ పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో పాకిస్థాన్‌ షెల్లింగ్‌ కారణంగా రెండేళ్ల ఐషా నూర్‌, మహ్మద్‌ షోహిబ్‌ (35) మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
* పూంచ్‌ జిల్లాలోని కంఘ్రా-గల్‌హుట్టా గ్రామంలో ఓ ఇంటిని మోర్టార్‌ గుండు తాకడంతో 55 ఏండ్ల రషీదాబీ ప్రాణాలు కోల్పోయింది.
* పాక్‌ కాల్పుల్లో ఆర్‌ఎస్‌ పురాలోని బిడీపూర్‌ జట్టా గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ అలియాస్‌ షోకి మృతి చెందాడు.

* జమ్ము శివారు ప్రాంతంలోని ఖేరి కెరన్‌ గ్రామంలో పాకిస్థాన్‌ షెల్లింగ్‌ కారణంగా జాకీర్‌ హుస్సేన్‌ (45) మరణించగా, ఓ బాలిక సహా ఇద్దరు గాయపడ్డారు.

కాగా, కశ్మీర్‌ లోయలోని ముఖ్యమైన ప్రాంతాలపై డ్రోన్‌ దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. భారత భద్రతా దళాలు శనివారం మూడు డ్రోన్లను కూల్చివేశాయి. తొలుత శ్రీనగర్‌లోని ఓల్డ్‌ ఎయిర్‌ఫీల్డ్‌పై ఎగురుతున్న డ్రోన్‌ను ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కూల్చివేసింది. అలాగే పట్టాన్‌లోని హైదర్‌బేగ్‌ ప్రాంతంలో సెక్యూరిటీ ఇన్‌స్టాలేషన్‌ సమీపంలో ఎగురుతున్న రెండు డ్రోన్లను భద్రతా బలగాలు కూల్చివేశాయి.