
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం విరుచుకుపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పంజాబ్, రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీసులు, రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకొని ముందుకుసాగాలని ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.
సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జమ్మూలోని భారత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లాతో కశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని భద్రతా చర్యలు కల్పించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
అటు ‘ఆపరేషన్ సిందూర్ ‘ నేపథ్యంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ‘ఆపరేషన్ సిందూర్’, అనంతర పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు