
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం రఫెల్ విమానాలతో మెరుపు దాడులు ప్రారంభించింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి, మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మొత్తం తొమ్మిది స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. పాక్ మీడియా ప్రకారం ఒక్క బహావల్పూర్లోనే 80 మంది హతమయ్యారు.
ఈ దాడులకు సంబంధించి అర్ధరాత్రి భారత సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది. కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడింది. . ‘పరిమిత చర్యలు చేపట్టడంతో తదుపరి పరిస్థితి తీవ్రం కాదు… పాక్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, అమలు చేయడంతో భారత్ గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది’ అని ఆ ప్రకటన పేర్కొంది. మెరుపుదాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేశారు. కాగా, మెరుపు దాడుల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద వరుసగా 13వ రోజు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను పాక్ బలిగొందని భారత సైన్యం తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని భారత్ పేర్కొంది.
పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో పాక్ ప్రతీకార చర్యలకు దిగితే పౌరులకు ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారత్‌లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారత్ మాతాకీ జై అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 1971 తర్వాత తొలిసారి పాక్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదు.. పాకిస్థాన్‌లోని నాలుగు చోట్ల దాడులకు స్థావరాలను ధ్వంసం చేశాయి.
పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ ప్రపంచ దేశాలకు వివరించింది. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి దాడుల సమాచారం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను భారత సైన్యం.. సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఏఱ్పడకుండా బంకర్లలోకి దాచిపెట్టింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు