ల‌ష్క‌రే పాత్రపై పాకిస్థాన్‌ను నిల‌దీసిన భ‌ద్ర‌తా మండ‌లి

ల‌ష్క‌రే పాత్రపై పాకిస్థాన్‌ను నిల‌దీసిన భ‌ద్ర‌తా మండ‌లి
 
పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో లేవ‌నెత్తారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని కఠిన ప్ర‌శ్న‌లు వేశారు. బైసార‌న్‌లో జ‌రిగిన న‌ర‌మేధం వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర సంస్థ హ‌స్తం ఉందా? లేదా? అన్న ప్ర‌శ్న వేశారు. ఈ అంశంలో పాకిస్థాన్‌ను యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు గ‌ట్టిగా నిల‌దీశాయి. 
 
పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ చెప్పింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అంతర్గత చర్చ జరిగింది.  పహల్గాం ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించగా భారత్‌ గట్టిగా బదులిచ్చింది.
 
సభ్యదేశాలు కూడా పహల్గాం ఉగ్ర దాడిని ముక్తకఠంతో ఖండించాయి. ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్య దేశాలు పాక్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్థాన్‌ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపైనా నిలదీసినట్లు సమాచారం. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో పాకిస్థాన్​ ఒకటి. ఆ దేశం అభ్యర్థన పైనే ఈ సమావేశం జరిగింది. 
 
తన సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకొని భారత్‌ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత భావించింది. కానీ, ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి దానికే ఎదురు క్లాస్‌ తీసుకొన్నాయి. దాదాపు గంటన్నర జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం, తీర్మానాలు లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్య సమితి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.  ఇరుదేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మహమ్మది ఖిలారీ వెల్లడించారు.
బహిరంగంగా అణు బెదిరింపులకు దిగుతున్న పాకిస్థాన్​పై చాలా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల పాకిస్తాన్​ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించాయి. 
అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో భారత్‌ కుట్రపన్ని పహల్గాం తనకు తానే దాడి చేసుకొని(ఫాల్స్‌ఫ్లాగ్‌ ఆపరేషన్‌) పాక్‌పై నిందలు మోపుతోందన్న వాదనలను కూడా సభ్యదేశాలు తోసిపుచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలంటూ తేల్చి చెప్పాయి. 
 
అంతేకాకుండా ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయ ప్రజలను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే పాకిస్తాన్​ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకొంది. అయినా ఏ దేశమూ దానితో చేయి కలపలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా భేటీ అనంతరం పత్రికా ప్రకటనలో పాలుపంచుకోలేదు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పాక్​కు చాలా దేశాలు సలహా ఇచ్చాయి. 
 
పాక్‌ తరఫున ఐరాస శాశ్వత ప్రతినిధి అసీమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ హాజరయ్యారు. భద్రతా మండలి సభ్య దేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ ప్రతినిధి ఇఫ్తికార్​ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సమావేశంలో తమ లక్ష్యాలు నెరవేరాయని చెప్పారు.