
పహల్గాంలో ఉగ్రదాడులను ముందుగానే పసికట్టి, శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో హోటళ్లలో బసచేస్తున్న పర్యాటకులపై దాడులు జరిపే అవకాశాలు ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తున్నది. ఉగ్రవాదులు ఈ సారి తమ పంథా మార్చుకున్నారని, అత్యంత ప్రధానమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే అత్యధిక సంఖ్యలో జనం తరలివచ్చే పహల్గాం ప్రాంతాన్ని ఎంచుకుని దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించినట్లు ఇప్పుడు దాడుల తరువాత వెల్లడైంది.
ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి చాలా కాలం ముందే శ్రీనగర్ శివార్లలోని హోటల్స్‌లో అతిధులుగా విడిది చేశారు. ప్రత్యేకించి జబరర్వాన్ శ్రేణి పర్వత పంక్తుల మధ్య ఉండే హోటల్స్‌లో తిష్ట వేసుకుని వీరి రెక్కి కార్యక్రమాలు జరిగాయని కూడా నిఘా వర్గాలు పసికట్టాయి. అయితే ఇప్పుడు ఈ దాడుల గురించి భద్రతా బలగాలకు, స్థానిక అధికార యంత్రాంగానికి ముందుగానే తెలిసినా ఎందుకు వీటిని నివారించలేదనేది కీలక ప్రశ్నగా మారింది.
నిజానికి ఉగ్రవాదులు గత నెల మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ కత్రా నుంచి జమ్మూకు తొలి రైలు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ దశలోనే తమ విద్రోహ చర్యలకు పాల్పడాలని లష్కరే తోయిబా అనుబంధ, ప్రోత్సాహక సంస్థలు నిర్ణయించుకున్నాయి. అయితే భారీ భద్రత, ఎవరికి తెలియకుండా రహస్య మార్గం ద్వారా ప్రధాని సభా స్థలికి చేరడం వంటి పరిణామాలతో ఉగ్రవాదులు మరో అవకాశం కోసం ఎదురు చూశారు.
అదును చూసుకుని పహల్గాం వద్ద పంజా విసిరారు. దీనికి బలి అయింది. కేవలం సుందర దృశ్యాలను చూసి ఆనందంగా తిలకించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలనుకున్న పౌరులే అని ఇప్పుడు వెల్లడైంది. జమ్మూకు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే లింక్ ఏర్పడితే ఇక ఈ ప్రాంతం పర్యాటకంగా వృద్ధి చెందడం జరిగితే తమ మూలాలు దెబ్బతింటాయని ఉగ్రవాదులు భావించారు.
రైలు మార్గ ప్రారంభానికి ప్రధాని రావల్సిన తేదీని ఓసారి వాతావరణ ప్రతికూలతతో వాయిదా వేశారు. తర్వాత నిర్విఘ్నంగా సాగింది. రైలు మార్గం ప్రారంభోత్సవం విజయవంతం, అంతర్జాతీయ స్థాయిలో కశ్మీర్ భారత్ అంతర్భాగంగా పలు దేశాల రమణీయక స్థలాలను తలదన్నేదిగా ఉండటం, సంబంధిత ఫోటోలు విశ్వవ్యాప్త ప్రచారం పొందడంతో ఈ టూరిస్టు ప్రాంతాలను ఎంచుకునే ఉగ్రవాదులు పంజా విసిరారు.
నిజానికి, దాడి ముప్పు దృష్ట్యా, శ్రీనగర్‌లోని దాల్ సరస్సు, మొఘల్ గార్డెన్లను పర్యవేక్షించే జబర్వాన్ శ్రేణి దిగువ ప్రాంతాలలో భద్రతా బలగాలను పెంచినట్లు అధికారులు తెలిపారు. “డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహా పోలీసు అధికారులు దాడికి ముందు కొన్ని రోజులు లోయలో మకాం వేశారు” అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. “వారికి (జె & కె పోలీసులతో సహా భద్రతా సంస్థలకు) నిఘా సమాచారం ఉంది. వారు దాడిని ఊహించారు. ఇది శ్రీనగర్ శివార్లలోని ఒక హోటల్ అని వారు భావించారు. ఎందుకంటే పౌరుల హత్యలు ఎక్కువగా దక్షిణ కాశ్మీర్లో జరిగాయి,” అని ఆ అధికారి తెలిపారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి