సైన్యం సమాచారం పాకిస్థాన్కు అందిస్తున్న వ్యక్తి అరెస్ట్

సైన్యం సమాచారం పాకిస్థాన్కు అందిస్తున్న వ్యక్తి అరెస్ట్
సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 2013లో నిందితుడు దాయాది దేశానికి వెళ్లి శిక్షణ పొందాడని దర్యాప్తులో గుర్తించారు. అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు.  సెల్‌ఫోన్ ద్వారా సైన్యానికి సంబంధించిన కదలికలను ఐఎస్‌ఐ ఏజెంట్లకు చేరవేశాడని వెల్లడించారు.
జైసల్మర్‌ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న మోహన్‌గఢ్‌లో నిందితుడు పఠాన్ ఖాన్ నివాసమున్నాడని ఇంటెలిజెన్స్ డీజీపీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. నిందితుడి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందడంతో నిఘా పెట్టామని చెప్పారు. అనంతరం అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిందితుడు 2013లో పాకిస్థాన్‌కు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.
2013 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్‌లో ఉన్నాడని వెల్లడించారు. మతపరమైన యాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు జైసల్మేర్‌ సరిహద్దు ఫొటోలను ఆ దేశ అధికారులకు చేరవేశాడని తెలిపారు “అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని మోహన్​గఢ్​ ప్రాంతానికి చెందిన పఠాన్ ఖాన్ అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేశాం. సైన్యం కీలక సమాచారాన్ని హ్యాండ్లర్ల ద్వారా పాకిస్థాన్​ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకు చేరవేస్తున్నాడు. ఈ సమాచారాన్ని ఇచ్చినందుకు అతడికి ఐఎస్ఐ నుంచి డబ్బులు అందుతున్నాయి” అని వివరించారు.

జైసల్మేర్​లో పఠాన్ ఖాన్​ను అరెస్ట్ చేసిన పోలీసలు అతడిని జైపుర్​కు తరలించారు. ప్రాథమిక సమాచారం సేకరించిన అధికారులు పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇతడిని రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా సంస్థలు కూడా విచారిస్తాయని వెల్లడించారు.