పిల్లర్ లేకుండా నిర్మించడంతోనే కూలిన సింహాచలం గోడ

పిల్లర్ లేకుండా నిర్మించడంతోనే కూలిన సింహాచలం గోడ
సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు మరణించిన ఘోర దుర్ఘటనపై  రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ గురువారం విచారణ ప్రారంభించింది. మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ నేతృత్వాన రాష్ట్ర ఈగల్‌ విభాగాధిపతి ఐజి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులతో కూడిన ఈ కమిటీ ప్రమాదం జరిగిన చోటును  పరిశీలించింది. 
 
కొండపై గోడ నిర్మాణం చేసిన కాంట్రాక్టరు, డిఇ, ఇఇలపై కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. గోడ నిర్మాణం పిల్లర్‌ లేకుండా చేశానని కాంట్రాక్టరు అంగీకరించారు. అందుకు తన మెడపై దేవాలయ ఇంజనీర్లు కత్తిపెట్టారరని తెలిపారు. నిర్మాణ సామగ్రిని ల్యాబ్‌ల్లో పరీక్షించకుండా చందనోత్సవం ఉందంటూ నాసిరకంగా గోడను నిర్మించేలా కాంట్రాక్టరుపై ఒత్తిడి తేవడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నట్టు స్పష్టమవుతోంది. 
 
కాంట్రాక్టర్‌ను కొండపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ “నాపై ఇంజనీర్లు తీవ్ర ఒత్తిడి చేశారు. చందనోత్సవం ఉంది. తక్షణం గోడ కట్టేయాలని పలుమార్లు చెప్పారు. నేను పనిని ఆపేసినా ఒత్తిడి పెంచి మరీ నాలుగు రోజుల్లో నిర్మాణం జరిగేలా చేశారు” అని త్రిసభ్య కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వద్ద కాంట్రాక్టరు కుండబద్దలుగొట్టారు.  ఇది ‘దేవుని కార్యం’ అని, ప్రసాదం స్కీంలో రిటైనింగ్‌ వాల్‌ కట్టాలన్న నిబంధన ఉన్నా ఆ స్కీంలోంచి దీన్ని తీసేసి తాత్కాలికంగా గోడ కట్టమన్నారని వివరించారు. మధ్యలో కట్టడం ఉపయోగం లేదని పనిని ఆపేసినా డిఇ, ఇఇ పని పూర్తి చేయాలంటూ హుకుం జారీ చేశారని త్రిసభ్య కమిటీకి తెలిపారు.
 
“ఈ పనులకు ఎవరు ఆమోదం తెలిపారు? ఎప్పుడు ఆమోదం తెలిపారు? ఇసుక, సిమెంట్‌, ఇటుకలు వంటి మెటీరియల్‌ను ఏ ల్యాబ్‌లో పరీక్షించారు” అంటూ త్రిసభ్య కమిటీ సభ్యులు కాంట్రాక్టరును ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ పనులు జరుగుతున్నప్పుడు దేవాదాయ శాఖ (సింహాచలం దేవస్థానం) తరఫున ఇంజనీర్లు ఉన్నారా? అంటూ అడగ్గా ఇద్దరు ఇంజనీర్లు మూడు రోజులపాటు మాత్రమే ఉన్నారని కాంట్రాక్టరు బదులిచ్చారు.

సింహాచలం చందనోత్సవం వేళ సుమారు లక్షన్నరకుపైగా యాత్రికుల తాకిడి ఉంటుందన్న అంచనా రాష్ట్ర ఎండోమెంట్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌కు, ఆలయ ఇఒ సుబ్బారావుకు ఉన్నా దేవాలయానికి అధికార పార్టీ నేతలు, మంత్రులు వచ్చిపోతున్నందున వారి ప్రోటోకాల్‌ను చూడడం, వారి పర్యవేక్షణలకే పరిమితమై గోడ నిర్మాణ పనులపై అశ్రద్ధ వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 
భవన నిర్మాణం లేదా గోడ నిర్మాణ సామగ్రిని సొంతంగానైనా లేదంటే అద్దెకు ల్యాబ్‌లోఐనా టెస్టింగ్‌ చేయించాలన్న నిబంధన ఉన్నా ఆలయ అధికారులు పక్కన పట్టించుకోకపోవడం, సరైన పిల్లర్లు లేకుండా కేవలం గోడను నాసిరకంగా 12 అడుగుల ఎత్తులో నిర్మించడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.