పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న బాలకృష్ణ

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న బాలకృష్ణ
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కనులవిందుగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు.
 
 ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి పద్మవిభూషణ్‌, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకోగా,  సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ, కళారంగంలో మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం ఏడుగురు తెలుగువారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా వారిలో తొలివిడత నలుగురు అవార్డులను అందుకున్నారు.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించినట్లు వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బాలయ్య మావయ్య పద్మభూషణ్ పురస్కారాన్ని ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకుంటున్న దృశ్యాన్ని స్వయంగా వీక్షించడం ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నటుడిగా, నాయకుడిగా ఆయన అసాధారణ ప్రయాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

1960 జూన్ 10న జన్మించిన నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చారు. ఆయన ‘తాతమ్మ కల'(1974) చిత్రంతో తెరంగేట్రం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు.  ‘సాహసమే జీవితం’ చిత్రంతో హీరోగా పరిచయమైన బాలకృష్ణ, ఇప్పటివరకు 109 సినిమాల్లో నటించారు.

50ఏళ్ల సినీ ప్రస్థానంలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో అలరించారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ.  తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆస్పత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతోమందికి ఉచితవైద్యం అందేలా కృషి చేస్తున్నారు.