ఉక్రెయిన్‌పై రష్యా మూడు రోజులు కాల్పుల విరమణ

ఉక్రెయిన్‌పై రష్యా మూడు రోజులు కాల్పుల విరమణ

చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనుంది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్, దాని మిత్ర దేశాలు విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా సీజ్ ఫైర్‌ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. 

మే 8 అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని, మే10 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు ఉక్రెయిన్‌పై అన్ని సైనిక చర్యలు నిలిపివేయాలని పుతిన్‌ ఆదేశించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ సమయంలో ఉక్రెయిన్‌ సైనిక దళాలు ఉల్లంఘనలకు పాల్పడితే తమ సైన్యం తగిన రీతిలో ప్రతిస్పందిస్తుందని రష్యా హెచ్చరించింది.

కాగా, ఏప్రిల్‌ నెల ప్రారంభంలో ఈస్టర్ సంధిని పుతిన్‌ ప్రకటించారు. అయితే ఈ కాల్పుల విరమణ కాలంలో రష్యన్ దళాలు మూడు వేలకు పైగా ఉల్లంఘనలను పాల్పడ్డాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు మందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కోలోని అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో పుతిన్‌ పేర్కొన్నారు. అయితే యుద్ధాన్ని ముగించే యోచనలో పుతిన్‌ లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.