దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం

దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం

* పహల్గాంకు బలమైన ప్రతిస్పందన ఆశిస్తున్నామని మరోసారి డా. భగవత్ 


పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ ‘దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడం మా మతం.. ఇది హిందూ మతం’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో `హిందూ మేనిఫెస్టో’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం పాల్గొంటూ దారుణాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యమని తెలిపారు.

“మనం బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాము. నిజంగా అహింసాయుత వ్యక్తి కూడా బలంగా ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు. కానీ బలం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అది కనిపించాలి” అని మోహన్ భగవత్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. “రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించినందున అతన్ని కూడా చంపారు. వేరే మార్గం లేదు. రాముడు అతన్ని చంపాడు కానీ అతనికి సంస్కరించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. అతను సన్మార్గంలోని రావడానికి ఇష్టం చూపించకపోయినప్పుడే అతన్ని చంపారు” అని ఆయన గుర్తు చేశారు.
పాకిస్తాన్‌ పేరు చెప్పకుండా ఆయన మాట్లాడుతూ అహింస మన ప్రాథమిక స్వభావమని, మనం పొరుగువారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టమని, కానీ కొందరు చెడుకు పాల్పడితే మార్గం ఏంటీ? అని ప్రశ్నించారు. రాజు విధి ప్రజలను రక్షించడమని పేర్కొంటూ రాజు తన విధిని నిర్వర్తించాలని హితవు చెప్పారు.  ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే రాజు తనపని తాను చేసుకుంటూ పోతారని స్పష్టం చేశారు. రాజు ప్రజలను రక్షించేందుకు రాజు తీసుకున్న చర్యలను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు.
అహింస మన స్వభావం, మన విలువ అని, అయితే  కొందరు ఏం చేసినా మారరని, వారంతా ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతూనే ఉంటారంటూ పాకిస్తాన్‌పై పరోక్షంగా మండిపడ్డారు. 
రాముడు సైతం రావణాసూరుడిని రాజ్య ప్రజల కోసమే చంపారని అంటూ అది హింస కాదని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే తప్పని చెప్పి, సరైన మార్గంలో నడిపించడం రాజు బాధ్యత,ఇప్పుడు కూడా రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడని మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు.

“రావణుని సంక్షేమం కోసమే చంపారు. దేవుడే అతన్ని చంపాడు. ఇది హింస కాదు, అహింస. అహింస మన మతం. దురాగతాలు చేసేవారిని ఎంతో కాలం మన్నించలేం. మనం మన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయకూడదు. దీని తర్వాత కూడా, ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే, ప్రజలను రక్షించడం రాజు విధి. రాజు తన పని తాను చేసుకుంటాడు” అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని డా. భగవత్ చెప్పారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని, అయితే వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారని, దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారని అంటూ పాకిస్థాన్ వైఖరిపై మండిపడ్డారు.  ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయర, ఇది మన స్వభావం కాదని, ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవని స్పష్టం చేశారు.

ఉగ్ర దాడి దేశ ప్రజలను ఎంతో వేధనకు గురి చేసిందని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించమని హెచ్చరించారు.  తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకునే వారమని,  కానీ, ఇప్పుడు మనం బలవంతులంమని, తప్పకుండా మన బలమేంటో శత్రువులకు చూపించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత తేల్చి చెప్పారు. 

“ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తు చేస్తోంది. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు. ఇది మా స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు, నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాలి” అని డా. భగవత్ స్పష్టం చేశారు.