ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ

ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ
 
పెహల్‌గామ్‌ నరమేధంపై  ఇండియన్‌ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది. పెహల్‌గామ్‌లో నరమేధం సృష్టించి 26 మందిని బలిగొన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, ఆషిఫ్‌ షేక్‌ ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి.  పెహల్‌గామ్‌ మారణహోమంలో జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన థోకర్‌ కీలక నిందితులలో ఒకరుకాగా, ఆషిఫ్‌ షేక్‌ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పుల్వామా జిల్లాలోని ట్రాల్‌లోనూ భద్రతా దళాలు మోంఘమా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా సమీపంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. రక్షణాత్మక ప్రదేశాలకు చేరుకునేసరికే ఒక ఇంట్లో నుంచి భారీ పేలుడు సంభవించింది. ఆ ఇల్లు లష్కరే తోయిబా స్థానిక కమాండర్ గా ఉన్న ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. 

బిజ్‌బెహారాలోని అదిల్ థోకర్ అలియాస్ అదిల్ గురి అనే ఎల్‌ఈటి ఉగ్రవాది ఇంటిని భారత సైనికులు పేల్చివేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో థోకర్ కూడా కీలక పాత్ర పోషించాడు. బిజ్‌బెహారా నివాసి అయిన ఆదిల్ థోకర్ 2018 లో చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ అతడు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. గతేడాది తిరిగి స్వగ్రామానికి వచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చాాలాకాలం నుంచి నిఘా సంస్థల రాడార్‌లో ఉన్నాడని అధికారులు చెబుతున్నారు.

కాగా, జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్ కు దారి తీశాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సమయంలోనే ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు.  దీంతో సైనికులు అంతే ధీటుగా ప్రతీకార చర్యకు దిగారు. ఇరువర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
 
కాగా,  దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్‌లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఎల్‌ఈటీకి చెందిన ఈ ముగ్గురిలో ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌ అనంత్‌నాగ్‌ వాసి కాగా, అలీ భాయ్‌ అక తల్హా భాయ్‌, హషీమ్‌ ముసాల అకా సులేమాన్‌లు పాకిస్థానీలు.