సరిహద్దుల్లో భారత్‌ సైన్యంపైకి పాక్ కాల్పులు

సరిహద్దుల్లో భారత్‌ సైన్యంపైకి పాక్ కాల్పులు
 
* పాక్ అనుకూల వ్యాఖ్యలపై అస్సాం ఎమ్యెల్యే అరెస్ట్
 
ఓవైపు తమదికాని కశ్మీర్‌ గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ, మరోవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తు కశ్మీర్‌లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న పాకిస్తాన్  తాజాగా పహల్గాంపైకి ముష్కరులను ఎగదోసి 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌, పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పిడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచిన పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది.
నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్‌ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటున్నది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తున్నది. సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దానిని తిప్పికొట్టాయని చెప్పారు.  గురువారం అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు సైనికి వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా,  పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్​ను వెనకేసుకొచ్చారనే ఆరోపణలపై అస్సాం ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం అభియోగాల కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో పాకిస్థాన్‌ను, ఆ దేశ ప్రమేయాన్ని ఎమ్మెల్యే అమీనుల్ సమర్థిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

సోషల్ మీడియా సహా ఏ విధంగానైనా పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు. అటువంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవంక, భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ ఒకరిని పాకిస్థాన్‌ రేంజర్స్‌ తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో బుధవారం మధ్యాహ్నం అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)ని పొరపాటున దాటిన పీకే సింగ్‌ అనే కానిస్టేబుల్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. 182 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన సింగ్‌ పశ్చిమ బెంగాల్‌ వాసి. ఫిరోజ్‌పూర్‌లో ఇండో-పాక్‌ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్థాన్‌ రేంజర్లతో ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిపారు.