
గత ఏడాదిన్నర వ్యవధిలో జమ్ముకశ్మీర్ మీదుగా 51 మంది విదేశీ ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడ్డారని భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2023 నవంబరు నాటికి భారత్‌లో ఉన్న విదేశీ ఉగ్రవాదుల సంఖ్య 71. ప్రస్తుతం ఈ సంఖ్య 122కు పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ఒకేసారి 122 మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారతదేశంలోకి చొరబడ్డారు. వారు జమ్మూకశ్మీర్ అంతటా వ్యాపించిపోయారని ఒక అధికారి చెప్పారు.
“పహల్గాం జరిగిన ఉగ్రదాడిలో విదేశీ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. ఈ దాడిని నిర్వహించడంలో విదేశీ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులు, వివిధ ఉగ్రవాద సంస్థల అండర్ గ్రౌండ్ వర్కర్లు సహాయ సహకారాలను అందించారు” అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లోకి చొరబడుతున్న చాలామంది ఉగ్రవాదులు గతంలో సిరియాలోని ఐసిస్ శిబిరాల్లో ఉగ్రవాద శిక్షణ పొందారు.
జమ్ముకశ్మీరు మీదుగా భారత్‌లోకి చొరబడిన విదేశీ ఉగ్రవాదుల్లో కొందరు తమ స్థావరాలను భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలపై వారు ఫోకస్ పెట్టారన్న సమాచారం భారత భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. “భారత్‌లో రహస్యంగా ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం ఐసిస్ మాడ్యూల్స్‌ను ప్రోత్సహించడం. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేయడం”అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
“భారత్‌లో వెలుగుచూసిన అనేక ఐసిస్ మాడ్యూల్ కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐసిస్ మాడ్యూల్ టెర్రర్ నుంచి ప్రేరణ పొందిన వారు ఉగ్రవాద నిధులను అందుకొని, వాటితో బాంబు పేలుళ్ల ఘటనలలో భాగమయ్యారు. ఈ విషయాన్ని మేం దర్యాప్తులో మేం గుర్తించాం. ఈ సంవత్సరం జనవరిలో ఢిల్లీ-పద్ఘా ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ఒక ఐసిస్ కార్యకర్తపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది” అని వివరించారు.
“రిజ్వాన్ అలీ అలియాస్ సమీ అలీ అలియాస్ అమీర్ ఖాన్ అలియాస్ అబూ సల్మా అలియాస్ డానిష్ సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి. ఇతడిపై ఐపీసీ అండ్ యూఏ(పీ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలను మోపింది. ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాల (ఐఈడీ) తయారీకి సంబంధించిన డిజిటల్ ఫైళ్లను ఇతర నిందితులతో పంచుకున్నందుకు రిజ్వాన్‌పై ఈ అభియోగాలను మోపారు. ఐసిస్ భావజాలం వైపు యువతను ఆకర్షించేందుకు రిజ్వాన్ యత్నించాడు. వారికి ఐఈడీలను తయారు చేయడం నేర్పించాడు. ఛార్జిషీట్ దాఖలు చేయబడిన 21వ ఐసిస్ కార్యకర్త రిజ్వాన్” అని సదరు ఎన్ఐఏ అధికారి తెలిపారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా