వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

* భారతీయ విమానాలకు పాక్ గగనతలం మూసివేత 

పెహల్గామ్ దాడి నేప‌థ్యంలో భార‌త్ తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ పాకిస్థాన్ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. వాఘా బోర్డ‌ర్‌ ను మూసివేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ సెక్యూటీ క‌మిటీ(ఎన్ఎస్సీ) స‌మావేశం త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క‌శ్మీర్‌లో జ‌రిగిన దాడి త‌ర్వాత భార‌త్ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌.. అత్య‌వ‌స‌రంగా ఎన్సీసీ మీటింగ్‌ను నిర్వ‌హించింది.

ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నివాసంలో పాకిస్తాన్‌ త్రివిధ దళాల అధిపతులు, ఇతర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పెహ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర్వాత చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. పాక్ ప్ర‌ధాని కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్రాంతీయ భ‌ద్ర‌తా, జాతీయ భ‌ద్ర‌తా ప‌ర్యావ‌ర‌ణం గురించి పేర్కొన్న‌ది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. దీంతో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేశారు.
 
కాగా, భారత్‌తోనూ అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు పాక్‌ గగనతలాన్ని తక్షణం మూసివేస్తున్నట్లు పేర్కొంది.  ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ గుండా లేదంటే.. మూడవ దేశాల నుంచి వెళ్లే వస్తువులతో సహా భారతదేశంతో అన్ని వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది. 
 
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని ఓ నివేదిక తెలిపింది. పాకిస్తాన్‌కు కేటాయించిన నీటిని అడ్డుకోవడం, దారి మళ్లించడం, దిగువ రాష్ట్రంగా దాని హక్కులను ఉల్లంఘించడం వంటి ఏదైనా చర్యను ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని పాకిస్తాన్‌ ప్రభుత్వం పేర్కొంది.
 
 కాగా, ఉగ్ర‌దాడిలో పాకిస్థాన్ హ‌స్తం ఉన్న‌ట్లు భార‌త్ పేర్కొకనడంపై స్పందిస్తూ పెహ‌ల్గామ్ దాడిలో త‌మ ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆధారాలు చూపాల‌ని పాకిస్థాన్ కోరింది. ప్ర‌పంచ దేశాల‌కు ఆ ఆధారాల‌ను వెల్లడించాల‌ని పాకిస్థాన్ ఉప ప్ర‌ధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. శ్రీన‌గ‌ర్‌లోకి కొంద‌రు విదేశీయులు ఆయుధాల‌తో ప్ర‌వేశించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని ఆరోపించారు. 
 
భార‌త ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్య‌క్తుల‌ను శ్రీన‌గ‌ర్‌లో దాచిన‌ట్లు ఆరోపించారు. భార‌తీయ నిఘా సంస్థ‌లు విదేశీయుల‌కు మద్దతు ఇస్తున్నాయ‌ని, ఆ విదేశీయులు భార‌త్‌కు ఐఈడీలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఒక‌వేళ భార‌త్ త‌మ‌పై ఎలాంటి చ‌ర్య‌ల‌కు దిగినా, దాన్ని ఎదుర్కొనేందుకు పాక్ సైనిక ద‌ళాలు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.