
జమ్ము కశ్మీర్‌లోని పెహల్‌గామ్ లో నరమేధానికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోను భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ఆసిఫ్ ఫౌజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్‌గా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ నలుగురు పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఈ నలుగురిలో ఇద్దరు విదేశీలుగా భావిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఉండటంతో ఈ దాడి వెనుక పాక్ కుట్ర ఉన్నట్లు బట్టబయలైంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం ముష్కరులు వాడిన భాష, ఇతర వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించారు. ఉగ్రవాదులు దాడి సమయంలో పష్తూన్ భాషలో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ నలుగురు ముష్కరులు మరో ముగ్గురు స్థానికులు సహకరించినట్లు తేలింది.
ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. “భారమైన హృదయంతో పెహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం” అని షా తీవ్రంగా హెచ్చరించారు. మృతులకు నివాళులర్పిస్తున్న ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్‌ను గుర్తించారు. ఉగ్రదాడికి అతడే ప్లాన్ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఖలీద్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్‌ఐఏ పేర్కొంటోంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం.
ఐఎస్‌ఐ, పాక్ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఖలీద్‌తోపాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పీవోకేకి చెందిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అంతకు ముందు, పర్యాటకులపై దాడి చేసిన ముగ్గురి ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఆ ముగ్గురు పూంఛ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల ఘనటల్లో కూడా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేసినట్లు భద్రతా సంస్థలు తెలిపాయి.
More Stories
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్
శబరిమల ఆలయం బంగారు మాయంపై క్రిమినల్ కేసు