హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు

హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు
క‌శ్మీర్‌లోని పెహ‌ల్గామ్‌లో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జరిపిన ఉగ్ర‌వాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. న‌లుగురు ఉగ్ర‌వాదులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. పెహల్గామ్‌కు ఆరు కిలోమీట‌ర్ల దూరంలో ఉండే బైస‌రాన్ ఓ సుంద‌ర ప్ర‌దేశం. అక్క‌డికి ప్ర‌తి రోజు వంద‌ల సంఖ్య‌లో పర్యాటకులు వ‌స్తుంటారు. అయితే ఆ ప‌ర్యాట‌కుల‌నే ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు.

బైస‌ర‌న్‌లో ఉన్న గ్రీన‌ర్ నుంచి ఆయుధాల‌తో చొర‌బ‌డిన ఉగ్ర‌వాదులు ఎంపిక చేసి మ‌రీ ఊచ‌కోత‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర సంస్థ‌కు అనుబంధంగా ఉన్న ద రెసిస్టాన్స్ ఫ్రంట్ సంస్థ ఉగ్ర‌వాదులు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడికి ఈ సంస్థే కార‌ణం. టూరిస్టుల ఐడీల‌ను చెక్ చేసి మ‌రీ కాల్చి చంపారు. 
పురుషుల దుస్తులు విప్పించిన‌ట్లు కొంద‌రు సాక్ష్యులు చెబుతున్నారు. హిందువులా కాదా అన్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చేందుకు అలా చేశార‌ని అంచ‌నా వేస్తున్నారు. 
ఉగ్రదాడిలో చోటుచేసుకున్న దారుణ మారణకాండలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇస్లామిక్‌ ధర్మోక్తిని (కల్మా కావొచ్చు) చదవమని బెదిరించిన ఉగ్రవాదులు, అందుకు తిరస్కరించడం వల్ల ఒక వ్యక్తిని హతమార్చారు.  తొలుత తలలో, ఆ తరువాత చెవిలో, అనంతరం వెనుకవైపు కాల్చారు. అలాంటి భయానక క్షణాలను మృతుని కుమార్తె ఫోన్ ద్వారా జాతీయ మీడియాకు వెల్లడించింది. పుణెకు చెందిన వ్యాపారవేత్త జగ్దలే తన కుటుంబంతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. ఉగ్రవాదులు రావడంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూనే టెంటులో దాక్కుంది. 
 
కానీ వాళ్లు వచ్చి 54 ఏళ్ల సంతోశ్‌ జగ్దలేను బయటకు పిలిచారు. ఇస్లామిక్‌ ధర్మోక్తిని (కల్మా కావొచ్చు) చదవమని బెదిరించారు. ఆయన అందుకు అంగీకరించకపోవడం వల్ల మూడు సార్లు కాల్పులు జరిపారు. దీంతో జగ్దలే కుప్పకూలారు.

“నా తల్లిదండ్రులతోపాటు మేం ఐదుగురం పహల్గాం వెళ్లాం. కాల్పులు ప్రారంభమైనప్పుడు మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్‌ లోయలోనే ఉన్నాం. నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా పక్కనే ఉన్న అంకుల్‌వైపు తిరిగారు. ఆయనపైనా కాల్పులు జరిపారు. నన్ను, నా తల్లిని, మా బంధువైన మహిళను వదిలేశారు. నా తండ్రి, అంకుల్‌ పరిస్థితి ఏమిటో తెలియలేదు” అని జగ్దలే కుమార్తె, అసావరీ వివరించారు.

ప్రధాని మోదీని సమర్థిస్తున్నందుకు తిట్టారని, కశ్మీరీ మిలిటెంట్లు, అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారని అసావరీ తెలిపారు. మహిళలను, పిల్లలను చంపడం లేదని చెప్పారని ఆమె వివరించారు. ప్రధానిని దూషించారని తెలిపారు.

సాయం చేసేందుకు ఎవరూ అక్కడ లేరని, 20 నిమిషాల తర్వాతే పోలీసులు, భద్రతా సిబ్బంది వచ్చారని అసావరీ తెలిపారు. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారూ ఇస్లామిక్‌ ధర్మోక్తిని చదువుతూ ఉండిపోయారని వెల్లడించారు. తమను పర్యాటక ప్రాంతానికి పోనీల్లో మోసుకెళ్లినవారే సాయం చేశారని, వారే తిరిగి తీసుకొచ్చారని అసావరీ వివరించారు. ఆ తరువాత ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారని, పహల్గాం క్లబ్‌కు తరలించారని తెలిపారు.