
కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలియడంతో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన భారత్ కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొగానే, అక్కడే ఆయనకు పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి అధికారులు వివరించారు. ఆ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు మోదీ. మంగళవారం జరిగిన దాడి తీరును వారు ప్రధాని మోదీకి వివరించారు. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం కానుంది.
పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కారణమైన వారిని శిక్షించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంకు ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విజ్ఞప్తి చేశారు. “జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి తీవ్రంగా ఖండించదగినది, బాధాకరమైంది. ఈ ఘటనలో మరణించిన వారందరికీ మేము నివాళులు అర్పిస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అంటూ దత్తాత్రేయ తెలిపారు.
“ఈ దాడి దేశ ఐక్యత, సమగ్రతపై దాడి చేయడానికి జరిగిన ప్రయత్నం. అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు అన్ని విభేదాలకు అతీతంగా తలెత్తి దీనిని ఖండించాలి. బాధితులందరికీ, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఈ దాడికి కారణమైన వారిని శిక్షించడానికి తక్షణ మరియు తగిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన సూచించారు.
మరోవైపు, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, కష్ట సమయంలో మనం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో పలు రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. దీంతో భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారా అన్న అనుమానంతో ఉగ్రవేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్టు అనుమనిస్తున్నారు.
More Stories
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్