
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్న ఆయన మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు సిఎం కలిసిన వారిలో ఉన్నారు.
అమిత్‌షాతో జరిపిన భేటీలో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఏకైక రాజ్యసభ స్థానాన్ని బిజెపికి కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుండి పోటీకి ఇతర రాష్ట్రాలకు చెందిన ఒకరిద్దరు పేర్లను బిజెపి అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజాకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేతల అరెస్టులు, రెండవ తేదీన జరగనున్న ప్రధాని పర్యటన తదితర అంశాలు కూడా అమిత్‌షాతో భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అమరావతిలో రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరమని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు కాగా, జగన్ హయాంలో పెద్దఎత్తున జరిగిన మద్యం కుంభకోణం గురించి కూడా చంద్రబాబు ఆయనకు వివరించినట్టు తెలిసింది. దీనితో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని, దాని ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని అనేక రకాలుగా మళ్లించారని ఆయన చెప్పినట్టు సమాచారం.
కేంద్ర జల్‌శక్తి మంత్రితో జరిపిన భేటీలో పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సాయం చేయాలని సిఎం కోరారు. కేంద్ర అటల్ భూజల్ యోజన్ కార్యక్రమంపై చర్చించారు. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, పిఎంకెఎస్వై-సిఎడిడబ్ల్యుఎం, నదుల అనుసంధానం వంటి అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ జరిగిన భేటీలో అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు.
న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సిఎం సమావేశం అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టిడిపి ఎంపిలు పాల్గొన్నారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం