
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ భారత్ పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందమే కీలకంగా మారింది. ఇప్పటికే ఉన్నతాధికారుల స్థాయిలో దీనిపై చర్చలు సాగుతుండగా, భారతదేశానికి సోమవారం వచ్చిన జెడి వాన్స్ సైతం ఈ ఒప్పందంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ముఖాముఖి చర్చల్లోనూ ఈ అంశమే ప్రధానంగా చోటుచేసుకుంది.
ఒప్పందానికి సంబంధించిన వివిధ అంశాలను నేతలు ఇద్దరు చర్చించారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక పురోగతిని సాధించామన్న అభిప్రాయాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకుపోనునన్నట్లు చెప్పారు.
ఇంధన, రక్షణ రంగాల్లో సహకారంపై, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించినట్లు ఈ ప్రకటన తెలిపింది.
అంతకుముందు నాలుగురోజుల పర్యటనకు గాను సోమవారం ఉదయం వాన్స్ తన కుటుంబం, అధికారులతో కలిసి ఎయిర్‌ఫోర్స్ 2 విమానంలో ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలో దిగారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఆయనతోపాటే వచ్చిన కుమారులు ఎవాన్(8), వివేక్(5), కుమార్తె మిరాబెల్(4) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అబ్బాయిలు కుర్తా పైజామా వేసుకోగా, కుమార్తె నీలాకుపచ్చ అనార్కలీ డ్రెస్‌లో మెరిసింది. కొద్ది సేపు విశ్రాంతి అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వాన్స్ ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు.
తన నివాసానికి వచ్చిన వాన్స్ కుటుంబ సభ్యులకు మోదీ ఎదురేగి సాదరంగా లోపలకు ఆహ్వానించారు. భారత సాంప్రదాయ దుస్తులను ధరించిన వాన్స్ పిల్లలతో ముచ్చట్లాడారు. అనంతరం ఇరువురు నేతలు విడిగా సమావేశమైనారు. వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై, పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ ఏడాది చివరిలోగా ట్రంప్ భారత్‌లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ సమస్యను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని మోదీ, వాన్స్‌లు వ్యక్తం చేశారు. ట్రంప్ తలపెట్టిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ లాంటిదే తాను తలపెట్టిన వికసిత భారత్ అని మోదీ గుర్తు చేశారు. తన కుటుంబం పట్ల మోదీ కనబరచిన ఆదరాభిమానాలకు వాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రజలతో స్నేహం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉండే సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు.
చర్చల అనంతరం వాన్స్ కుటుంబానికి ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు. వాన్స్‌తో పాటు వచ్చిన అమెరికా ప్రతినిధి బృందం కూడా ఈ ఆతిథ్యంలో పాల్గొంది. అంతకుముందు వాన్స్ కుటుంబం ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షరధామ్‌ను సందర్శించింది. అక్కడ లభించిన ఆతిథ్యాన్ని, అబ్బురపరిచిన ఆలయ నిర్మాణ శైలిని, కట్టడాన్ని ప్రశంసిస్తూ వాన్స్, ఆలయ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
వాన్స్ కుటుంబం జన్‌పథ్ లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రియల్ ఎంపోరియంను సందర్శించారు. కాగితం గుజ్జు బొమ్మలు, తేనె, టీ పొడులు కొన్నారు. వాన్స్ కుటుంబం సాయంత్రం రాగానే మోదీ తన ఇంటిని, తోటను పిల్లలకు తిప్పి చూపించారు. వాన్స్ పిల్లలు ఆసక్తిగా అనేక ప్రశ్నలు వేస్తూ మోదీతో మాట్లాడారు. ఆయన ఓపికగా వారికి సమాధానం ఇచ్చారు. మోదీ ఇచ్చిన నెమలి ఈకలను పిల్లలు సంతోషంగా తీసుకున్నారు.
నాలుగు రోజుల పాటు సాగే వాన్స్ పర్యటనలో దౌత్యపరమైన కార్యకలాపాలతో పాటూ ఇటు సాంస్కృతిక పరమైన అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరిటన్ హోటల్‌లో బస చేస్తున్న వాన్స్ కుటుంబం రాత్రి ప్రత్యేక విమానంలో జైపూర్ పర్యటనకు వెళ్లింది. అంబర్ ఫోర్ట్‌ను సందర్శిస్తారు.
పర్యటనలో భాగంగా వాన్స్ 23న ఆగ్రాను సందర్శించనున్నారు. తిరిగి జైపూర్ వచ్చి అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళతారు అమెరికా ఉపాధ్యక్షుడిగా వాన్స్‌కు ఇదే తొలి భారత పర్యటన. ఆయనకు ముందు జో బైడెన్ ఉపాధ్యక్ష హోదాలో 2013లో భారత్‌లో పర్యటించారు. కాగా, క్యాథలిక్ క్రైస్తవుడైన జేడీ వాన్స్ ఆదివారం వాటికన్ సిటీలో అనారోగ్యంగా ఉన్న పోప్ ప్రాన్సి్‌సను కలిశారు. ఆయన ఢిల్లీకి వచ్చేలోపు పోప్ మరణవార్త వెలువడింది. దాంతో వాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి