భార్య పల్లవి, కుమార్తె కృతి ఆయనను ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తోంది. అనంతరం పల్లవి మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియోకాల్ చేసి, రాక్షసుడిని చంపేశానంటూ మృతదేహాన్ని చూపించినట్టు సమాచారం. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఆమెతోపాటు కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 68 ఏళ్ల ఓం ప్రకాష్ బెంగళూరులోని మూడంతస్తుల బిల్డింగ్‌లో నివసిస్తున్నారు.
ఆదివారం ఇంట్లో అనుమానాస్పదంగా ఆయన మరణించినట్లు భార్య పల్లవి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఓం ప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయానంద ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓం ప్రకాష్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల స మయంలో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు.
రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్‌ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడలేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి సమాచారం అందిన తర్వాత ఓం ప్రకాష్ మృతిపై మాట్లాడతామని చెప్తున్నారు.
మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకుముందు ఓ వాట్సప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని, తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడని అందులో ఓం ప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం, అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. దీనిపైనా పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఓం ప్రకాష్ భార్యను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
బీహార్‌లోని చంపారన్‌కు చెందిన ఓం ప్రకాష్ 1981 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. 2015 మార్చిలో కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆయన నియమితులయ్యారు. 2017లో ఆ హోదాలో పదవీవిరమరణ చేశారు. దీనికి ముందు కర్ణాటక ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోంగార్డ్స్ చీఫ్‌గా వ్యవహరించారు. బళ్లారి జిల్లా హరప్పణహళ్లిలో అడిషనల్ ఎస్పీగా తన కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు ప్రాంతాల్లో పనిచేశారు. కర్ణాటక లోకాయుక్తగానూ సేవలందించారు.

More Stories
కొత్త హరిత ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలువెనకడుగు?
అరెస్టైన వైద్యురాలు భారత్‌లో జైషే మహిళా అధిపతి
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు