
పాకిస్థాన్ లోని సింధ్‌కు చెందిన ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడు, మత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. ఈ విషయంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ప్రజా ప్రతినిధులపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై తాను కోహిస్తానీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే హిందూ నేత అయిన ఖేల్ దాస్ కోహిస్తానీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడిగా, మత వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
సింధ్ రాష్ట్రంలో `గ్రీన్ పాకిస్థాన్’ కార్యక్రమం క్రింద నిర్మించనున్న నూతన కాలువలకు ఇటీవల ఆయన ప్రణాళికను రూపొందించారు. అయితే దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. శనివారం ఆయన సింధ్‌లోని తట్టా జిల్లా గుండా సాగునీటి పధకాలను సందర్శిస్తూ వెళ్తుండగా నిరసనకారులు సమాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌పై కర్రలు, టమాటలు, బంగాళాదుంపలతో దాడి చేశారు.
వెంటనే భద్రతా దళాలు ఆయనను అక్కడి నుండి తప్పించాయి. అయితే ఈ దాడిలో కోహిస్తానీకి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆయన తన కార్యక్రమాలను కొనసాగించారు. ఈ సాగు నీటి పధకాలు పాకిస్తాన్ లో, ముఖ్యంగా పంజాబ్ లో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుండగా, తమ ప్రాంతంలోని నీటి వనరులపై ప్రభావం చూపుతుందని సింధ్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్