సుప్రీం తీర్పుపై పార్టీ ఎంపీ వ్యాఖ్యలకు జెపి నడ్డా అభ్యంతరం

సుప్రీం తీర్పుపై పార్టీ ఎంపీ వ్యాఖ్యలకు జెపి నడ్డా అభ్యంతరం
వక్ఫ్‌ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగకముందే బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్‌ దుబె సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.  ఈ దేశంలో జరుగుతున్న అన్ని అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలి అంటూ తీవ్రమైన వాఖ్యలు చేశారు.

అయితే, అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకులను, ఇతరు సభ్యులను ఆదేశించినట్లు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. “న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబధం లేదు. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. కానీ జేపీపీ వాటితో ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు” అని ఆయన స్పష్టం చేశారు. 

వారి వాఖ్యాలను బీజేపీ పూర్తిగా తిరిస్కరిస్తుందని చెబుతూ ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమైన న్యాయవ్యవస్థ పట్ల అధికార పార్టీకి గౌరవం ఉందని, తమ మా పార్టీ రాజ్యాంగ రక్షణకు బలమైన స్తంభ అని చెబుతూ జేపీ నడ్డా ఎక్స్​లో పోస్ట్​ చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందేనంటూ నిశికాంత్‌ దుబె ఎక్స్​ వేదికగా శనివారం పోస్ట్​ పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. 

జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో నిశికాంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గవర్నర్‌ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆ తీర్పు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ రెండు అంశాల్లో కోర్టు తీసుకున్న నిర్ణయాలను విపక్షాలు కొనియాడాయి. సుప్రీంకోర్టుపై నిషికాంత్ దూబే చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు ఆయనపై దాడి చేశారు. కాంగ్రెస్ నాయకుడు మాణికం ఠాగూర్ సుప్రీంకోర్టుపై నిషికాంత్ దూబే చేసిన ప్రకటన “అపకీర్తికరమైనది” అని అభివర్ణించారు. అత్యున్నత న్యాయస్థానంపై ఆయన చేసిన దాడి “ఆమోదయోగ్యం కాదు” అని పేర్కొన్నారు.

 
“ఇది సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటన. నిషికాంత్ దూబే ఇతర సంస్థలన్నింటినీ నిరంతరం కూల్చివేస్తున్న వ్యక్తి. ఇప్పుడు, ఆయన సుప్రీంకోర్టుపై దాడి చేశారు. ఆయన పార్లమెంటులో కాకుండా దాని వెలుపల మాట్లాడుతున్నందున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనిని దృష్టిలో ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. సుప్రీంకోర్టుపై ఆయన చేసిన దాడి ఆమోదయోగ్యం కాదు” అని ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.