అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!

అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ బోర్డు) పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నాలుగోసారి చేపట్టిన తర్వాత మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మొదటిసారిగా  టీటీటీ పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను తొలగించే ప్రక్రియను టీడీడీ ప్రారంభించింది. 
 
ఇందులో భాగంగా శనివారం ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది. పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. 
 
క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోని అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.

టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. తాజాగా బీజేపీతో కలిసి అధకారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు.
 
టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది. ఈ అంశంపై మరింత సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.