దన్‌ఖడ్ వ్యాఖ్యలపై విపక్షాలు ఆక్షేపణ, తిప్పికొట్టిన బీజేపీ

దన్‌ఖడ్ వ్యాఖ్యలపై విపక్షాలు ఆక్షేపణ, తిప్పికొట్టిన బీజేపీ
బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, న్యాయవ్యవస్థ, దాని ప్రొసీడింగ్స్‌పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో దుమారం రేగుతోంది. రాష్ట్రపతిని ఆదేశించే విధంగా న్యాయవ్యవస్థ వ్యవహరించడాన్ని థన్‌ఖడ్ తప్పుపట్టారు. జడ్జీలే సూపర్ పార్లమెంటును నడిపిస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ప్రధాన విపక్ష పార్టీలు మండిపడగా, ఉపరాష్ట్రపతికి సమర్ధనగా బీజేపీ స్పందించింది.  న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితప పార్టీలు తప్పుపట్టాయి. న్యాయవ్యవస్థను బలహీనపరిచేలా ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించడం ఆయన ధిక్కార వైఖరిని చాటుతోందని  విపక్ష పార్టీలు విమర్శించాయి.  ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం సుప్రీం అని, రాష్ట్రపతి అయినా ప్రధాని, గవర్నర్లు అయినా దానికి అతీతులు కారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులపై గడువులోగా రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సరైన సమయంలో సాహసోపేతమైన తీర్పు ఇచ్చిందని ఆయన కొనియాడారు.

టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ సైతం న్యాయవ్యవస్థపై గౌరవం లేకుండా ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు జడ్జిలపై ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, కోర్టు ధిక్కారానికి పాల్పడటమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇతర రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందని హితవు చెప్పారు. 

న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు అనైతకమని డీఎంకే నేత తిరుచ్చి శివ ధ్వజమెత్తారు.  ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఒక రాజ్యసభ చైర్మన్‌ ఇలా రాజకీయ ప్రకటనలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని  రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు.  రాష్ట్రపతికి వ్యక్తిగత అధికారాలు ఉండవని, ఆ పదవిలో ఉన్న వారు నామమాత్రపు అధిపతి మాత్రమేనని, వారు మంత్రి మండలి సహాయం, సలహాలపై మాత్రమే పనిచేస్తారని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌లు అధికార, విపక్ష పార్టీలకు సమాన దూరాన్ని పాటించాలే తప్ప ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరించ కూడదని హితవు చెప్పారు.

కాగా, రాష్ట్రపతి అభిప్రాయానికి సమర్ధనగా బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందించారు. విపక్ష పార్టీల హిపోక్రసీని తప్పుపట్టారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పిన వాళ్లు, ఉపరాష్ట్రపతిని హేళన చేసిన వారు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడేవాళ్లని మండిపడ్డారు.  బెంగాల్‌లో హిందూ బాధితులను పరామర్శించేందుకు కూడా తీరిక లేని వాళ్లు రాజ్యాంగ ఔన్నత్యం గురించి మాట్లాడటం హాస్పాస్పదమని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ల నుంచి తాము పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

రాష్ట్రపతిని ఆదేశించే విధంగా న్యాయ వ్యవస్థ వ్యహరించడాన్ని జగ్‌దీప్ ధన్‌ఖడ్ వ్యతిరేకంచారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణ ప్రజాస్వామ్య వ్యవస్థలపై న్యూక్లియర్ మిజైల్స్ తరహాలో వాడుతున్నారని ఆరోపించారు. డెడ్‌లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదని స్పష్టం చేశారు. 

జడ్జీలే శాసనసభ వ్యవహారాలు చూస్తున్నట్టు, ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు, సూపర్ పార్లమెంటును నడిపిస్తున్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇందుకు ఐదు, అంతకుమించి ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని చెప్పారు.