అయోధ్యలో 80 మీటర్ల పొడవైన సొరంగం నిర్మాణం

అయోధ్యలో 80 మీటర్ల పొడవైన సొరంగం నిర్మాణం
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో రామమందిర ప్రాంగణంలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని నిర్మించారు.

లక్షన్నర మంది భక్తులు ఒకేసారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 800 మీటర్ల పొడవైన గోడను కడుతున్నారు. ఇది దాదాపుగా 75 శాతం పూర్తైంది. దీంతో పాటుగా ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించారు. 

దేశంలోనే ఆలయంలో నిర్మించిన మొట్టమొదటి సొరంగం ఇదే. ఆలయ సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి వెళ్లొచ్చు. దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు.

అయోధ్య రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని సులభంగా నివారించే విధంగా సొరంగాన్ని రూపొందించామని ఎల్ అండ్ ​టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా తెలిపారు. ఈ టన్నెల్ ఆలయంలో ప్రవేశించే వారికి, ప్రదక్షిణ చేసే వారికి మధ్య రద్దీని నివారించడంలో సహాయపడుతుందని చెప్పారు. 

ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులో సొరంగం ఓ భాగమని వెల్లడించారు. “రామమందిరాన్ని సందర్శించే వారి సంఖ్యను అంచనా వేయలేం. ప్రతిరోజూ 1.5 లక్షల మంది సందర్శకులు ప్రదక్షిణలు చేసుకునేలా ఓ గోడను నిర్మించాం. దీని గుండా భక్తులు ఆలయానికి చేరుకోవాలి. అక్టోబర్ నాటికి సొరంగం పనులు పూర్తవుతాయి. ” అని పేర్కొన్నారు.

మూడు అంతస్తుల్లో నిర్మితమవుతున్న రామమందిరం ఎత్తు 161 అడుగులు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నిర్మాణం కొనసాగుతుండగా, 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మరో 6 ఆలయాలను సైతం కడుతున్నారు.