విశాఖ మేయర్​పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం

విశాఖ మేయర్​పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం
విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై కూటమి పక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మాన పరీక్షకు విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు.

ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవగా హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. అయితే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.

విశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌, కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి ఇతరులను అనుమతించలేదు. మెంబర్లు హాల్‌లోకి రాగానే ఫోన్లు ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. విశ్వాసపరీక్షకు ఏర్పాట్లను ముందు నుంచీ జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి హరేంధిరప్రసాద్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.

అవిశ్వాస తీర్మాన పరీక్ష నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు. పాస్ చూసి జీవీఎంసీ లోపలికి అనుమతించారు. జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. పోలీసు కమిషనర్ శంఖబత్ర బాగ్చి భద్రతా ఏర్పాట్లు చేశారు.

జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్‌ అఫిషియో సభ్యులు 16 మంది ఉండగా, 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైఎస్సార్సీపీకి నలుగురి బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14 , బీజేపీకి ఇద్దరు, టీడీపీకి 48 మంది కలిసి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉండగా, సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు.