
* ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు 33 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో తొమ్మిది మంది మహిళలు సహా 22 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సిఆర్పిఎఫ్) సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారు.
తరువాత ఇద్దరు మహిళలు సహా 11 మంది నక్సల్స్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్ కు రూ. 49 లక్షల బహుమతిని అధికారులు అందించారు. ఈ సందర్భంగా సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ మాట్లాడుతూ అమానవీయ మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై దౌర్జన్యాలతో నిరాశకు గురైన వీరంతా మావోయిస్టు క్యాడర్ ను బయటకు వచ్చారని తెలిపారు.
లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, స్క్వాడ్ సభ్యురాలైన ఆయన భార్య ముచాకి జోగి ఉన్నారని తెలిపారు. వరిలో రూ.8 లక్షల అవార్డు ఉందని పేర్కొన్నారు. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కక్కరిపై రూ.5 లక్షల రివార్డు, మరో ఏడుగురిపై రూ.2 లక్షలు రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన మరికొందరికి భద్రతా బలగాలపై దాడుల్లో ప్రమేయం ఉందని చెప్పారు.
మారుమూల గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నియాద్ నెల్లనార్’ (మీ మంచి గ్రామం) పథకం, లొంగిపోయిన నక్సల్స్ కు పునరావాస విధానం వారిని ఆకట్టుకున్నాయని అధికారి తెలిపారు. వీరందరికి ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. గతేడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న కూడా 26 మంది నక్సలైట్‌లు సరెండరైన విషయం తెలిసిందే. అంతకు కొన్ని రోజుల ముందు 70 మంది మావోలు మూకుమ్మడిగా లొంగిపోయారు.
కాగా, నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాల సమాచారం. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కోహ్కమెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కసోద్ – కుమురాడి అడవిలో భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్