అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు భారత్‌ను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. భారత్‌పై అగ్రరాజ్యం దాదాపు 28శాతం మేర దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. దీంతో విదేశీ ఎగుమతులపై ఆధారపడిన భారత్‌లోని వివిధ రంగాలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కశ్మీర్‌లోని ప్రఖ్యాత తివాచీ (కార్పెట్) పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
శ్రమకు తగిన వేతనాలు లేక ఇప్పటికే సమస్యల్లో ఉన్న కశ్మీరీ కార్పెట్ ఇండస్ట్రీలోని ఉద్యోగులు, కూలీలపై ట్రంప్ సుంకాలు పిడుగులా వచ్చి పడ్డాయి.
కశ్మీర్ నుంచి ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు రూ.17వేల కోట్లు విలువైన హ్యాండ్ మేడ్ తివాచీలు ఎగుమతి అవుతుంటాయి. ఇందులో దాదాపు రూ.10వేల కోట్ల ఎగుమతులు ఒక్క అమెరికాకే జరుగుతుంటాయి. ఈ లెక్కన సగానికిపైగా ఆర్డర్లు అమెరికా నుంచే వచ్చేవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను పెంచడం వల్ల కశ్మీర్ నుంచి సప్లై అయ్యే తివాచీల రేట్లను అమెరికా మార్కెట్లో పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా రేట్లు పెరిగినందున వాటిని కొనేందుకు అమెరికన్లు వెనుకాడుతున్నారు. యంత్రాలతో తయారయ్యే తివాచీలు తక్కువ రేటుకే లభిస్తుండటం వల్ల, వాటిని కొనేందుకు అమెరికా వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామంతో కశ్మీరీ తివాచీలకు ఆర్డర్లు కరువయ్యాయి. ఫలితంగా తివాచీలను తయారు చేసే ఎంతోమంది కశ్మీరీ చేతివృత్తి కళాకారులకు ఉపాధి కరువైంది.
”మేం ఇప్పుడు రోజువారీ ఇంటి ఖర్చులను వెళ్లదీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్నాం. తివాచీల తయారీ కోసం పెద్దగా ఆర్డర్లు రావడం లేదు. మేం తయారు చేసే కార్పెట్లపై అమెరికా సుంకాలను పెంచింది. అందుకే భారత్ నుంచి అమెరికాకు వాటి ఎగుమతులు తగ్గిపోయాయి. విలువైన తివాచీలను తయారు చేస్తున్నా మాకు వచ్చే వేతనాలు అంతంత మాత్రమే” అని శ్రీనగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ దార్(50), ఆయన భార్య షమీమా చెప్పుకొచ్చారు.
”రెండు దశాబ్దాల క్రితం శ్రీనగర్‌లోని పాత డౌన్‌టౌన్‌లో వందలాది మంది కార్మికులు తివాచీలను తయారు చేసేవారు. వారంతా అప్పట్లోనే ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు. ఇక్కడ నా కుటుంబం మాత్రమే తివాచీ పనిలో మిగిలింది” అని మహ్మద్ యూసుఫ్ దార్ చెప్పారు. ”మేం ఒక్కో తివాచీ తయారీకి నెలల కొద్దీ శ్రమిస్తాం. మగ్గం వర్క్ చేస్తాం. చేతితో ఓపిగ్గా దారపు ముడులు వేస్తాం. కనీస వేతనం, తగిన డిమాండ్ లేకుంటే.. చేతిలో ఎంత నైపుణ్యమున్నా అది పనికి రాని దానిలాగే అనిపిస్తుంది” అని ఆయన వాపోయారు.
విలాయత్ అలీ కశ్మీర్ ప్రాంతం నుంచి తివాచీలను భారత్‌లోని ఎంతోమంది ఎగుమతిదారులకు సరఫరా చేస్తుంటారు. ఈయన వద్ద నుంచి తివాచీలను కొనేవారు.. వాటిని అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు ఎగుమతి చేస్తారు. ట్రంప్ సుంకాలను పెంచగానే తన వ్యాపారం డౌన్ అయిందని విలాయత్ అలీ తెలిపారు. ”నాకు వచ్చిన డజన్ల కొద్దీ తివాచీ ఆర్డర్లు అకస్మాత్తుగా రద్దయ్యాయి. ఎంతో మంది తివాచీ ఎగుమతిదారులు ఆర్డర్లు ఇచ్చేందుకు నో చెబుతున్నారు. తగినంత లాభం మిగలడం లేదని వారు అంటున్నారు” అని విలాయత్ అలీ వివరించారు.
More Stories
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం