తమిళనాడు మంత్రిపై కేసు నమోదు.. హైకోర్టు ఆదేశం

తమిళనాడు మంత్రిపై కేసు నమోదు.. హైకోర్టు ఆదేశం

త‌మిళ‌నాడు అట‌వీ శాఖ మంత్రి కే పొన్ముడిపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర పోలీసుల‌కు మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌ల ఆ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ డీఎంకే నేత‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కుంటే, అప్పుడు పోలీసుల‌పై సుమోటో కేసు న‌మోదు అవుతుంద‌ని జ‌స్టిస్ ఎన్ ఆనంద్ వెంక‌టేశ్ హెచ్చరించారు.  మంత్రి పొన్ముడి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలించామ‌ని, ఒక‌వేళ ఆ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు లేకున్నా సు రిజిస్ట‌ర్ చేసి, దానిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని న్యాయ‌మూర్తి త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు.

ఈ కేసును మ‌ళ్లీ ఏప్రిల్ 23వ తేదీన విచారించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  శైవ‌- వైష్ణ‌వ మ‌త త‌త్వాల‌పై మంత్రి పొన్ముడి ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  హిందువుల ఆచార గుర్తుల‌ను ఆయ‌న సెక్స్ వ‌ర్క‌ర్ల శృంగార భంగిమ‌ల‌తో పోల్చారు. ప‌లు మార్లు హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే రీతిలో పొన్ముడి మాట్లాడారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి చాలా హేయ‌మైన రీతిలో మ‌హిళ‌ల ముందే అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ అయ్యింది. త‌న ప్ర‌సంగంలో భాగంగా ఓ జోక్ వేసిన మంత్రి.. త‌న వ్యాఖ్య‌ల‌తో ఇర‌కాటంలో ప‌డ్డారు. ఓ వేశ్య వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి వెళ్లాడ‌ని, అప్పుడు ఆమె నువ్వు శివ‌భ‌క్తుడివా(శైవ‌మా) లేక విష్ణుభ‌క్తుడివా(వైష్ణ‌వ‌మా) అని అడిగింద‌ని, ఆ ప్ర‌శ్న‌కు ఆ వ్య‌క్తి అయోమ‌యంలోకి వెళ్లాడ‌ని, అప్పుడు ఆమె నువ్వు అడ్డం బొట్టు పెట్టుకుంటావా లేక నిలువు బొట్టు పెట్టుకుంటావా అని అడిగింద‌ని పేర్కొన్నారు. 

ఒక‌వేళ నువ్వు శివ‌భ‌క్తుడివి అయితే అప్పుడు కింద ప‌డుకునే భంగిమ ఉంటుంద‌ని, ఒక‌వేళ విష్ణుభ‌క్తుడివైతే అప్పుడు స్టాండింగ్ పొజిష‌న్ ఉంటుంద‌ని ఆ వేశ్య పేర్కొన్న‌ట్లు మంత్రి జోకేశారు. మంత్రి చేసిన ఆ జోక్ తీవ్ర దుమారం రేపింది. డీఎంకే పార్టీ న‌ష్ట‌నివార‌ణ‌ చ‌ర్య‌ల్లో భాగంగా పొన్ముడిని డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హోదా నుంచి త‌ప్పించింది. డీఎంకే నేత ఎంపీ క‌నిమొళి కూడా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివ‌ర‌కు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.