
దేశవ్యాప్తంగా కులగణన జరపాలని ఒకవంక రాహుల్ గాంధీ కోరుతుంటే, మరోవంక, కర్ణాటక కాంగ్రెస్‌లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలోని లింగాయత్, వొక్కలిగ నేతలు ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలో 17న మంత్రివర్గం సమావేశమై కులగణన నివేదికపై చర్చించనుంది. కుల గణనకు సంబంధించిన నివేదికను ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచారు. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుత అంచనా కన్నా 38 శాతం అధికంగా రాష్ట్రంలో ఓబీసీల సంఖ్య 69.6 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వొక్కలిగలు, లింగాయత్‌లు 3ఏ, 3బీ క్యాటగిరీల కింద ఓబీసీ రిజర్వేషన్లు 12.2 శాతం, 13.6 శాతం అనుభవిస్తున్నారు.
జనాభా పరంగా వీరి సంఖ్య 17 శాతం, 15 శాతం ఉండవచ్చునని అంచనా కాగా, అంతకన్నా తక్కువగా వీరి సంఖ్య నమోదైంది. అయితే ప్రస్తుత కుల సర్వే 4 శాతం పాయింట్లను పెంచుతూ వీరిని 2బీ క్యాటగిరీ కింద ఉంచాలని సిఫార్సు చేసింది. దీంతో వొక్కలిగ, లింగాయత్‌లకు రిజర్వేషన్లలో మూడు శాతం పెరిగి స్వల్ప ప్రయోజనం ఏర్పడనుంది.
అయితే ఓబీసీ వర్గాల కోటా పెంచుతూ నివేదిక సిఫార్సు చేయడం ఇంతకాలం రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం వహిస్తూ వచ్చిన వొక్కలిగ, లింగాయత్ వర్గాల్లో ఆందోళనకు దారి తీసింది. ఊహించిన దాని కన్నా అత్యధికంగా ఉన్న ఓబీసీలకు కోటా పెంపు వల్ల జనాభా ప్రాతిపదికన మిగిలిన వర్గాలకు సీట్ల కేటాయింపు పెరుగుతుందని, తద్వారా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల టికెట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆ వర్గం నేతలు ఆందోళన చెందుతున్నారు.తాజా పరిణామాలతో కాంగ్రెస్‌లో వొక్కలిగల ఆధిపత్యం ఏమాత్రం తగ్గకూడదని ఆ వర్గానికే చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆ వర్గ ఎమ్మెల్యేలు, నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. కాగా, కుల సర్వే అంతా ఫార్సుగా బీజేపీ కొట్టిపారేసింది. ఇది మైనారిటీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ చేసిన సర్వే అని, అందులోని అంకెలన్నీ సీఎం సిద్ధరామయ్య చెప్పినవేనని బీజేపీ నేత ఆర్ అశోక ఆరోపించారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్