
విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వచ్చే నెలలో ఎండలు మరింత ముదిరే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు నిత్యం ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ట్రాఫిక్ రద్దీ, అకాల వర్షాలు, వరదలు అయితే తాజాగా నగర వాసులకు మరో కష్టం వచ్చి పడింది. హైదరాబాద్ నగరంలో భూ గర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించారు. కూకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు కూకట్పల్లి జోన్లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మే చివరినాటికి ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భజల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాదికంటే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గినట్టు భూగర్భ జల అధికారుల సర్వేలో తేలింది. గ్రేటర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలను తెలంగాణ ప్రభుత్వ భూగర్భజల వనరుల శాఖ విశ్లేషించింది. ఈ విశ్లేషణలో గతేడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్లు తక్కువగా ఉన్నట్లు తేలింది.
గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో విశ్లేషించగా 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. 2024 జనవరి కంటే జలాలు అడుగంటిపోగా మరో 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. 2024 డిసెంబరు, ఈ ఏడాది జనవరి చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 0.58 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గినట్లు గుర్తించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత