సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషన్‌ రామకృష్ణ గవాయ్‌ నియామకం కానున్నారు. జస్టిస్‌ బి ఆర్ గవాయ్‌ను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రతిపాదన చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీన ముగియనుంది.
 
సంప్రదాయం ప్రకారం తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను న్యాయశాఖ కోరగా, ఆయన జస్టిస్‌ బి ఆర్ గవాయ్‌ పేరును ప్రతిపాదించారు. ఫలితంగా మే 14వ తేదీన జస్టిస్‌ గవాయ్‌ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. 
భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతను నిర్వహించనున్న రెండో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిగా జస్టిస్‌ గవాయ్‌ నిలవనున్నారు. ఆయన కన్నా ముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్‌ కె జి బాలకృష్ణన్‌ సీజేఐ పదవిని చేపట్టారు.
 
కాగా డీవై చంద్రచూడ్‌ పదవీ విరమణతో ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా 2024 నవంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవాయ్‌ పూర్తిపేరు భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. ఆయన 1960 నవంబర్‌ 24న అమరావతిలో జన్మించారు. జస్టిస్ గవాయ్ 1985 న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 
 
1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగపూర్ బెంచ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులై 2005లో పెర్మనెంట్ జడ్జి అయ్యారు. 2019లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.