కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. ‘ముడా’ కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు అనుమతించింది.
కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ‘బి రిపోర్ట్’తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ విచారణ చేపట్టారు.
లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే ‘బి రిపోర్ట్’పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ముడా కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని గత ఫిబ్రవరిలో లోకాయుక్త పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూమి యజమాని దేవరాజు నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు.
More Stories
రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు