బ్రోకర్లతో నిండిన కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం

బ్రోకర్లతో నిండిన కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మరో ఇద్దరు సీనియర్‌ మంత్రుల కార్యాలయాలలో అవినీతి విలయతాండవం చేస్తోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం (కేఎస్‌సీఏ) గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు అవినీతి చీడ మితిమీరి పోయిందని కేఎస్‌సీఏ వెల్లడించింది. 
శివకుమార్‌ కార్యాలయంలో బ్రోకర్లు కిక్కిరిసిపోయి ఉంటారని కేఎస్‌సీఏ అధ్యక్షుడు ఆర్‌ మంజునాథ్‌ ఆరోపించారు. మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రి ఎన్‌ఎస్‌ బోస్‌రాజు కుమారుడు రవి బోస్‌రాజు లావాదేవీలన్నీ తానే జరుపుతారని, ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహోళి బంధువు ఒకరు శాఖాపరమైన వ్యవహారాలలో తలదూరుస్తాడని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై శివకుమార్‌ స్పందిస్తూ కాంట్రాక్లర్లు ఫిర్యాదు నమోదు చేయాలని కోరగా బోస్‌రాజు, సతీష్‌ వీటిని ఖండించారు. ప్రభుత్వంకు గాని లేదా లోకాయుక్తకు గాని ఫిర్యాదు చేస్తే వీటిపై దర్యాప్తు జరిపిస్తామని శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో జరిగిన ఓ కార్యక్రమంలో ముడుపులు, దళారులకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే కేఎస్‌సీఏ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. 

అవినీతిలో కర్ణాటక దేశంలోనే నంబర్‌ వన్‌ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసవరాజ్‌ రాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే ఏకంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం సీనియర్‌ మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

పైగా, `అదృశ్య హస్తాలు’ గత మూడు, నాలుగు నెలలుగా ప్రభుత్వంలో  వ్యవస్థను కలుషితం చేస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో ఇద్దరు మంత్రులకు మంజునాథ్ ఇటీవల లేఖలు వ్రాసారు. పెండింగ్ బిల్లుల కోసం దళారులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులతో సగమైనా రూ 15,000 కోట్ల మేరకు చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు.