యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు

యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు

డిజిటల్ పేమెంట్స్​పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ వ్యక్తి-నుంచి-వ్యాపారికి (పి2ఎం) లావాదేవీ పరిమితులను త్వరలో సవరిస్తామని ప్రకటించింది. దీంతో ఇకపై వినియోగదారులు వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం లభించనుంది. 

ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ)కుఆర్బీఐ అనుమతిని మంజూరు చేసింది. యుపిఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యాపారికి (పి2ఎం) లావాదేవీల పరిమితులను త్వరలో సవరించనున్నట్లు  ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. 

అయితే వ్యక్తి-నుంచి-వ్యక్తి (పి2ఎం) లావాదేవీల పరిమితి లక్ష రూపాయలుగానే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పి2పి, పి2ఎం రెండింటికీ యుపిఐ పరిమితి రూ. 1 లక్షగానే ఉంది. కానీ తాజా నిర్ణయంతో వ్యక్తుల నుంచి వ్యాపారులకు చేసే ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచుకోవచ్చు. 

ఈ మేరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చించిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పి2ఎం లావాదేవీల పరిమితిని ఎన్ పిసిఐ పెంచుకోవచ్చని మల్హోత్రా స్పష్టం చేశారు.

“యూపీఐ వ్యక్తి-నుంచి-వ్యాపారికి (పి2ఎం) లావాదేవీ పరిమితులను త్వరలో సవరిస్తాం. దీంతో వినియోగదారులు వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం లభించనుంది. యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు, వినియోగాన్ని పెంచడానికి ఈ ప్రతిపాదన చేస్తున్నాం” అని తెలిపారు. 

వినియోగదారుల కొత్త అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, యుపిఐ ఎకో సిస్టమ్​లోని వాటాదారులను సంప్రదించి ఈ పరిమితిని సర్దుబాటు చేసే స్వేచ్ఛ ఎన్ సిపిఐకి ఉంటుందని చెప్పారు. ఆర్బీఐ తాజా నిర్ణయం డిజిటల్ పేమెంట్స్​లో కొత్త వినియోగ అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ముఖ్యంగా ఇది విదేశాలలో యుపిఐ చెల్లింపులకు ప్రయోజనం చేకూరుస్తుంది.యుపిఐ చెల్లింపులను అంగీకరించే చాలా దేశాల కరెన్సీలు భారత రూపాయి కంటే ఎక్కువ విలువైనవి (కొన్ని మినహాయింపులతో). అందువల్ల విదేశాలలో చెల్లింపులు చేసేటప్పుడు భారతీయ రూపాయలలో ఆర్బీఐ నిర్ణయించిన పరిమితులు సరిపోవు. అధిక పరిమితుల కారణంగా ఈ లోపం తొలగిపోతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.