
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది.
1945 జనవరిలో జర్మనీపై సోవియట్ ఆర్మీ దాడి ప్రారంభించింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ మే 9న బేషరతుగా జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై మార్షల్ ఆఫ్ కమాండర్స్ సంతకాలు చేశారు. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్రదేశాలకు ఆహ్వానం పంపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపింది. విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు.
కాగా, గతేడాది జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించారు. గత పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ కూడా అంగీకరించారు. అయితే, తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
‘పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. గతేడాది మోదీ మాస్కోలో పర్యటించారు.. ఇప్పుడు మా వంతు’ అని రష్యా రాయబార కార్యాలయం గత నెల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక పుతిన్, మోదీలు తరచూ ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. వివిధ అంశాలపై సంభాషించుకుంటున్నారు. అంతేకాదు పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరువురు నేతలు సమావేశమవుతున్నారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం