అమెరికా ఎయిర్ పోర్ట్ లో భారతీయ మహిళ నిర్బంధం

అమెరికా ఎయిర్ పోర్ట్ లో భారతీయ మహిళ నిర్బంధం

భారతీయ మహిళకు అమెరికా ఎయిర్ పోర్ట్ లో తీవ్ర అవమానం జరిగింది. వేధింపులకు గురైంది. సెక్యూరిటీ సిబ్బంది చలిగా ఉండే గదిలో ఓ యువ భారత పారిశ్రామిక వేత్తను నిర్బంధించి, ఓ పురుష అధికారి, చలినుంచి కాపాడుకునేందుకు ఆమె వేసుకున్న దుస్తులను తొలగించి, శారీరకంగా తనిఖీ చేశారు. కనీసం హ్యాండ్ బ్యాగ్ కానీ, పర్స్ కానీ ముట్టుకోనివ్వలేదు. ఎవరికీ ఫోన్ చేసే అవకాశం ఇవ్వలేదు. 

ఆమె లగేజీ పూర్తిగా చిందరవందర చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఫలితంగా ఆమె తాను ఎక్కాల్సిన విమానం మిస్ చేసుకుంది. ఇంతకీ ఆమె హ్యాండ్ బ్యాగ్ లో -పవర్ బ్యాంక్ – కనిపించడమే ఈ సెక్యూరిటీ హడావుడికి కారణం. అలాస్కాలోని యాంకరేజ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తాను అనుభవించిన టార్చర్ ను వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసి, అమెరికా పోలీసులు, ఎఫ్ బీఐ సెక్యూరిటీ చేతిలో ఏడు గంటలపాటు తాను నరకం అనుభవించానని తన ఆవేదన పంచుకుంది. అమె ఇండియన్ యాక్షన్ ప్రాజెక్టు, చాయ్ పానీ వ్యవస్థాపకురాలు.

” 8 గంటలపాటు ఓ చల్లని గదిలో నిర్బంధించారు. సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లో ఓ పురుష సిబ్బంది తనను తనిఖీ చేశారు. వెచ్చదనం కోసం వేసుకున్న దుస్తులు తీసేయాలని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌, వాలెట్‌ అన్నీ తీసుకున్నారు. కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేసుకునేందుకు అనుమతించలేదు. వీటన్నింటి కారణంగా వెళ్లాల్సిన విమానం మిస్‌ అయ్యింది” అని ఆ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చారు. 

దీనికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, విదేశాంగ శాఖను ట్యాగ్‌ చేశారు. మార్చి 30న శ్రుతి చతుర్వేది అలస్కా వెళ్లి అక్కడ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం తిరుగు పయనం అవుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపారు.

తన వద్ద అనుమానించాల్సిన వస్తువేదీ కన్పించకపోవడంతో 8 గంటల నరకం తర్వాత తనను, తన స్నేహితురాళిని విడిచి పెట్టారని, అమెరికానుంచి బయటపడిన తర్వాతే తాను తనకు జరిగిన ఘోర అవమానాన్ని పోస్ట్ చేస్తున్నానని శ్రుతి చతుర్వేది వివరించారు. శ్రుతి పోస్ట్ తో విదేశాలలో భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై ఆందోళన వ్యక్తమైంది.