వడగాల్పుల కారణంగా మూడో వంతు పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

వడగాల్పుల కారణంగా మూడో వంతు పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

2024 వేసవి సమయంలో వడగాల్పుల కారణంగా భారత్‌లో విద్యుత్‌ డిమాండ్‌ మూడోవంతు వంతు పెరిగింది. 2024 ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు తీవ్రమైన వడగాల్పుల నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 2023లో ఇదే సమయంతో పోలిస్తే 10.4 శాతం పెరిగింది. ఎయిర్‌ కండిషనింగ్‌ పరికరాల వాడకం గణనీయంగా పెరగడంతో విద్యుత్‌ వినియోగం దాదాపు మూడింట ఒక వంతు పెరిగినట్లు మంగళవారం విడుదలైన నివేదిక తెలిపింది.

2024లో ప్రపంచ విద్యుత్‌ డిమాండ్‌లో సుమారు ఐదవ వంతు పెరుగుదలకు వేడిగాలులు కారణమని గ్లోబల్‌ ఎనర్జీ సంస్థ గ్లోబల్‌ ఎలక్ట్రిసిటీ రివ్యూకి చెందిన ఆరవ ఎడిషన్‌ కూడా స్పష్టం చేసింది. శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కూడా 1.4శాతం పెరగడానికి వడగాల్పులు కారణమయ్యాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్గారాలు 1.6 శాతం పెరగడంతో పాటు 223 మిలియన్‌ టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ విడుదలైందని తెలిపింది. 

మొత్తం ఉద్గారాలు రికార్డు స్థాయిలో 14.6 బిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. వడగాల్పులు లేని సమయాల్లో శిలాజ ఇంధన ఉత్తత్తి కేవలం 0.2 శాతం మాత్రమే పెరిగేదని తెలిపింది. భారత్‌లో, 2024లో ఏప్రిల్‌-సెప్టెంబర్‌ నెలల్లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ 6.1శాతం పెరిగింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే 19 శాతం పెరుగుదల నమోదైందని గ్లోబల్‌ ఎనర్జీ సంస్థ అంచనా వేసింది. 

వేడిగాలులు అత్యధికంగా ఉండే ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు గరిష్ట వేడిగాలులతో విద్యుత్‌ డిమాండ్‌ 2023 కంటే అధికంగా ఉంది. ఎయిర్‌ కండిషనింగ్‌ వార్షికంగా 30 శాతం పెరిగిందని అంచనా వేసింది. మే నెలలో, ఎయిర్‌కండిషనింగ్‌ వార్షికంగా మూడింట ఒక వంతు పెరుగుదలకు కారణమైందని నివేదిక తెలిపింది. 2024లో భారత్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 5 శాతం పెరిగింది. ఈ అదనపు డిమాండ్‌లో క్లీన్‌ ఎనర్జీ వనరులు 33శాతం తీర్చగా, బొగ్గు ఉత్పత్తి 64శాతం తీర్చింది. 2023తో పోలిస్తే బగ్గు వినియోగం తగ్గిందని, ఆ ఏడాది  బొగ్గు వినియోగం 91శాతం పెరుగదులను సాధించింది.

రానున్న దశాబ్దంలో భారత్‌లో 130 నుండి 150 మిలియన్ల ఎయిర్‌కండిషనర్ల వినియోగం పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. ఇది 2035 నాటికి గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 180 గిగావాట్స్‌ కన్నా అధికం కావచ్చు. ఇది విద్యుత్‌ గ్రిడ్‌ను దెబ్బతీస్తుందని తెలిపింది.  ఈ వేసవిలో భారత్‌లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 9 నుండి 10శాతం పెరిగే అవకాశం ఉందని గత నెలలో అంచనా వేసింది. ఈ ఏడాది అధిక వేడిగాలుల రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.