బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌

బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌
శ‌తాధిక వృద్ధ మ‌హిళ‌, ఆధ్యాత్మిక నేత, బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ దాది ర‌త‌న్‌ మోహిని క‌న్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్ర‌హ్మ‌కుమారిగా ర‌త‌న్ మోహిని రికార్డు నెల‌కొల్పారు. 
అంత‌కుముందు దాది జాన‌కి బ్ర‌హ్మ‌కుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జాన‌కి 1916, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన జ‌న్మించి, 2020, మార్చి 27వ తేదీన మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజుల నుంచి దాది ర‌త‌న్ మోహిన్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది. రాజ‌స్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివ‌నంలోని ట్రామా సెంట‌ర్‌కు డ‌యాల‌సిస్ కోసం ఆమెను త‌ర‌లించారు.

సోమ‌వారం ఆమె ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంగా మారింది. దీంతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న ఆమెను అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1.20 నిమిషాల‌కు ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్ర‌హ్మ‌కుమారి ప్ర‌ధాన కార్యాల‌యంలో శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాన్ని తీసుకెళ్ల‌నున్నారు.

ప్రస్తుత పాకిస్థాన్​లోని హైదరాబాద్​లో సంప్రదాయ కుంటుంబంలో 1925 మార్చి 25 జన్మించారు. చిన్నతనంలో విద్యపై ఆసక్తి చూపిన రతన్, బ్రహ్మ కుమారీల గురించి తెలిసిన తర్వాత ఇటు వైపు మళ్లారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీలలో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో ఆమె రాజస్థాన్​కు వచ్చారు. 

ఆమె చివరి రోజల వరకు ఎంతో చురుకుగా ఉండేవారని బ్రహ్మకుమారీలు చెబుతున్నారు. వందేళ్ల వయసులోనూ ఉదయాన్నే 3.30 గంటలకు నిద్రలేచి పనులు చేసుకునేవారని వివరించారు. రాత్రి 10 వరకు సంస్థ కార్యకలపాలను పర్యవేక్షించేవారని తెలిపారు. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్ర‌హ్మ‌కుమారి ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫ‌రెన్స్‌లో బ్ర‌హ్మ‌కుమారీల త‌ర‌పున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె ప‌ర్య‌టించారు.