
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ విధించిన సుంకాల నుంచి ఉపశమనం కలిగించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, అయితే ఇవి ప్రతీకార చర్యగా ఉండకూడదని భావిస్తున్నదని తన పేరును వెల్లడించడానికి నిరాకరించిన ఆ అధికారి తెలిపారు.
అటువంటి ఒప్పందాల కోసం భారత్ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. ప్రతీకార సుంకాల విషయానికి వస్తే ఇతర ఆసియా దేశాలైన చైనా, వియత్నాం, ఇండోనేషియాతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, ఇది మనకు ప్రయోజనకర అంశమని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 2న భారత్‌తోసహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు.
అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 49 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అమెరికా నుంచి భారత్ 52 శాతం సుంకాలు వసూలు చేస్తున్నదని, అందుకే ఆ దేశంపై 26 శాతం సుంకాలు విధిస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం, వైట్ హౌస్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు