
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనా విధించిన కొద్దీ రోజుల తర్వాత మైతీ, కుకీ వర్గాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు శనివారం తెలిపాయి. జాతి ఘర్షణలకు ముగింపు మైతీ, కుకీల మధ్య విశ్వాసం, సహకారాన్ని పెంపొందించడం, మణిపూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన ప్రణాళిక లక్ష్యంగా ఈ చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొన్నాయి.
ఆల్ మణిపూర్ యునైటెడ్ క్లబ్స్ ఆర్గనైజేషన్ (ఎఎంయుసిఒ), ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఒసిఎస్) ప్రతినిధులతో కూడిన ఆరుగురు సభ్యుల మైతీ బృందం ఈ చర్చలకు హాజరైనట్లు తెలిపింది. కుకీ ప్రతిధుల బృందంలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం తరపున ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డ్ స్పెషల్ డైరెక్టర్ ఎ.కె. మిశ్రా చర్చలకు హాజరయ్యారని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే, హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలిసిన ప్రతినిధులు ఎటువంటి పరిష్కారంకు రాలేదని తెలిపారు. 2023 మేలో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైన తర్వాత ప్రస్తుత జాతి విభజనకు సంబంధించిన రెండు వైపుల సంస్థలు అధికారికంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి. గత అక్టోబర్‌లో, హోంశాఖ రాష్ట్రంలోని మెయిటీ, కుకి-జో, నాగా ఎమ్మెల్యేల సమితి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కానీ కుకి-జో ఎమ్మెల్యేలు ఇతర వర్గాల ఎమ్మెల్యేలను కలవలేదని, అధికారులను విడివిడిగా మాత్రమే కలిశామని చెప్పారు. శనివారం జరిగిన సమావేశంలో, అధికారులు రెండు వైపులా పరిశీలన కోసం ముసాయిదా ‘ఒప్పందం’ లేదా ఉమ్మడి తీర్మానాన్ని సమర్పించారని ప్రతినిధులు తెలిపారు. ఇందులో ఇతర సమాజ సభ్యులపై హింసకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
దీనిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని పరిపాలనను కోరడం; ఆయుధాలను తిరిగి పొందడంలో సహకారానికి హామీ ఇవ్వడం; రహదారులపై “రహదారుల స్వేచ్ఛా కదలిక”ను అనుమతించమని ప్రజలను కోరడం వంటివి ఉన్నాయి. దీనితో పాటు, ప్రభుత్వం ద్వారా లాజిస్టిక్స్ , భద్రతతో నిర్వాసితులైన ప్రజలను వారి వారి ప్రదేశాలకు తిరిగి పంపడానికి వీలు కల్పించే స్వాగత కార్యక్రమాలు కూడా ‘ముసాయిదా ఒప్పందం’లో ఉన్నాయి.
సంఘర్షణ సమయంలో నిర్లక్ష్యంకు గురైన ప్రాంతాలలో అభివృద్ధి పనులకు “ప్రాధాన్యత ఇవ్వమని” గవర్నర్‌కు “విజ్ఞప్తి”. కీలకమైన చివరి అంశం ఏమిటంటే, “అన్ని దీర్ఘకాలిక, వివాదాస్పద సమస్యలను కేంద్ర హోంశాఖతో చర్చలు జరపడం, సమాజాలతో సమాలోచనలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారం కోసం కృషి చేయాలి.
“రెండు వైపుల నుండి చర్చల తర్వాత అధికారులు రాష్ట్రంలో అమలు చేయడానికి ఈ ఆరు అంశాలను రూపొందించారు. మా వైపు నుండి, మేము మా సమ్మతిని ఇచ్చాము. వీటికి అంగీకరించాము ఎందుకంటే మేము ఎటువంటి సంఘర్షణను కోరుకోలేదు. అయితే, కుకి-జో వైపు నుండి, వారు తమ సమ్మతిని ఇవ్వడానికి ఇష్టపడలేదు,” అని ఎఎంయుసిఒ అధ్యక్షుడు ఫిరోయిజామ్ నాండో లువాంగ్ తెలిపారు.
అయితే, కుకి-జో కౌన్సిల్ చైర్మన్ హెన్లియాన్‌థాంగ్ థాంగ్లెట్ ఈ సమావేశాన్ని “చాలా చారిత్రాత్మకం” అని పిలిచారు. “ఇది అంగీకరించకపోవడం అనే విషయం కాదు. ఇది మొదటి సమావేశం. మేము సమయం తీసుకొని మళ్ళీ మాప్రజలను సంప్రదించాలి. రెండు వైపులా బాధితులు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్లి ఒప్పందంపై సంతకం చేయలేము. ఎందుకంటే మన ప్రజలకు ఏదైనా జరిగితే, మనం జవాబుదారీగా ఉంటాము,” అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత సంఘర్షణకు “పరిష్కారం”గా లోయ ఆధారిత రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక పరిపాలనా నిర్మాణం కోసం కుకి-జో గ్రూపులు ఒత్తిడి చేస్తున్నాయి. “జిల్లాల మధ్య ‘స్వేచ్ఛా కదలిక’ విధించబడకూడదని, లోయలోని అన్ని జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం విధించాలనే షరతుపై మాత్రమే శత్రుత్వాలను నిలిపివేయవచ్చనేది మా ఆందోళనలలో ఒకటి. ఎందుకంటే లోయ నుండి ప్రజలు మా ప్రాంతాలలోకి ప్రవేశించి మాపై దాడి చేయగలరనే భయాలు మాకు ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కోసం సంభాషణలు ప్రారంభించాలి,” అని ఆయన తెలిపారు.
మార్చి 11, 12 తేదీలలో, మిశ్రా నేతృత్వంలోని హోంమంత్రిత్వ ప్రతినిధి బృందం మణిపూర్‌లోని మెయిటీ, కుకి-జో గ్రూపులతో విడిగా సమావేశమైంది. ఇంఫాల్‌లో, ఇది మెయిటీ గ్రూప్ సిఓసిఓఎంఐని కూడా కలిసింది.అయితే ఈ సమావేశంలో “పాల్గొనడానికి నిరాకరించిందని పేర్కొంది. దీనిని “పురోగతి భ్రమను కల్పించడానికి మరొక వ్యూహాత్మక యుక్తి, హోంమంత్రి పార్లమెంటరీ ప్రసంగానికి చర్చనీయాంశాలను అందించడానికి అనుకూలమైన సమయం” అని పేర్కొంది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు