
* ప్రధాని మోదీకి మిత్ర విభూషణ పురస్కారం
రెండు దేశాల భద్రత పరస్పరం ముడిపడి ఉన్నదని, పరస్పర ఆధారితం అని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె మధ్య విస్తృత చర్చల దరిమిలా రెండు దేశాలు సంతకం చేసిన ఏడు కీలక ఒప్పందాల్లో రక్షణ ఒప్పందం ఒకటి. వ్యూహాత్మక సంబంధాల పెంపుదలకు దోహదం చేసేదిగా భావిస్తున్న రక్షణ ఒప్పందం ఆ ద్వీప దేశంలో భారత శాంతి పరిరక్షక దళం (ఐపికెఎఫ్)జోక్యం చేసుకున్న సుమారు నాలుగు దశాబ్దాల తరువాత చోటు చేసుకున్నది.
“మా భద్రత ప్రయోజనాలు ఒకేవిధమైనవని మేము భావిస్తుంటాం. రెండు దేశాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడినది, పరస్పర ఆధారితమైనది” అని మోదీ తన మీడియా ప్రకటనలో తెలియజేశారు. “భారత ప్రయోజనాల పట్ల అధ్యక్షుడు దిసనాయకె సున్నితత్వానికి ఆయనకు కృతజ్ఞుడిని. రక్షణ సహకారంలో ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం” అని ఆయన తెలిపారు.
భారత భద్రత ప్రయోజనాలకు భంగకరమైన రీతిలో తమ భూభాగాన్ని వినియోగించుకోవడానికి శ్రీలంక అనుమతించబోదని ప్రధాని మోదీకి దిసనాయకె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అవసరమైన సమయాల్లో శ్రీలంకకు భారత సహాయం, కొనసాగుతున్న సంఘీభావం ఎంతగానో అభినందనీయం అని కూడా మోదీతో చెప్పానని ఆయన తెలిపారు.
ఉభయ దేశాలు సంతకం చేసిన మరొక ముఖ్యమైన ఒప్పందం ఇంధన శక్తి కేంద్రంగా ట్రిన్‌కోమలిని అభివృద్ధిచేయడానికి ఉద్దేశించినది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు దిసనాయకె వర్చువల్‌గా సంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు కూడా ప్రారంభోత్సవం చేశారు.
“సంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టు శ్రీలంక ఇంధన భద్రతకు తోడ్పడుతుంది. బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్ నిర్మాణం, ఇంధన శక్తి కేంద్రంగా ట్రిన్‌కోమలి అభివృద్ధి కోసం సంతకం చేసిన ఒప్పందాల వల్ల శ్రీలంక ప్రజలు అందరూ లబ్ధి పొందుతారు”అని ప్రధాని తెలియజేశారు. రెండు దేశాల మధ్య గ్రిడ్ అనుసంధాన ఒప్పందం వల్ల విద్యుత్ ఎగుమతికి శ్రీలంకకు మార్గాలు ఏర్పడతాయని ఆయన సూచించారు.
భారత పొరుగుదేశాలు ప్రథమం విధానంలోను, ‘మహాసాగర్’ లక్షంలోను శ్రీలంకకు ‘ప్రత్యేక స్థానం’ ఉందని మోదీ చెప్పారు. “అధ్యక్షుడు దిసనాయకె భారత పర్యటన దరిమిలా గడచిన నాలుగు మాసాల్లో మా సహకారం గణనీయంగా పురోగమించింది” అన ఆయన తెలిపారు. లంక అధ్యక్షుడు దిసనాయకే తనకు మిత్ర విభూషణ్ అవార్డును అందజేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు కూడా గర్వకారణమని పేర్కొన్నారు.
చర్చలకు ముందు మోదీకి శ్రీలంకరాజధాని నడిబొడ్డున చారిత్రక ఇండిపెండెన్స్ స్కేర్‌లో వైభవోపేతంగా స్వాగతం లభించింది. ఒక విదేశీ నేలకు అటువంటి గౌరవం లభించడం ఇదే మొదటిసారి. శ్రీలంక జాతీయ దినోత్సవాల వేదిక అయిన ఇండిపెండెన్స్ స్కేర్‌లో ప్రధాని మోదీకి అధ్యక్షుడు దిసనాయకె స్వాగతం పలికారు. 1948లో బ్రిటిష్ పాలన నుంచి ద్వీప దేశానికి లభించిన స్వాతంత్య్రానికి గుర్తుగా నిర్మించిన ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్ నుంచి ఆ కూడలికి ఆ పేరు వచ్చింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు